పొలంపిలుస్తోందికి స్పందన కరువు
● వారానికి నాలుగు గ్రామాల్లో నిర్వహించాలి
● రెండు గ్రామాల్లో నిర్వహించి మమ
అనిపిస్తున్న వైనం
● కార్యక్రమాలకు ఇతరశాఖల అధికారుల గైర్హాజరు
● పట్టించుకోని అధికారులు
పార్వతీపురం టౌన్: రైతులకు సాగుపై అవగాహన కల్పించి సస్యరక్షణలో శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్ది వ్యవసాయం లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో వ్యవసాయశాఖ అధికారులతో పాటు అనుబంధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు వ్యవసాయాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు గ్రామాల్లోని రైతుల క్షేత్రాలను సందర్శించడంతో పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సమాచారాన్ని అందించాలి. విత్తన ఎంపిక మొదలు ఎరువులు, పురుగు, తెగులు నివారణ మందులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అన్ని సమస్యలపై నేరుగా చర్చించి అవగాహన కల్పించాలి. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. వ్యవసాయశాఖ అధికారులు మినహా మిగిలినవారు ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో మంగళ, బుధవారాల్లో రెండు గ్రామాలు చొప్పున వారానికి నాలుగు గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించి పొలాలను పరిశీలించి అభ్యుదయ రైతులను ప్రోత్సహించాల్సి ఉంది. కాని నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుండడంతో లక్ష్యానికి దూరంగా సాగుతోంది.
కార్యక్రమం నిర్వహణ ఇలా..
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ లక్ష్యంగా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి మంగళ, బుధవారాల్లో వ్యవసాయ, అనుబధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజా ప్రతినిధులు పొలం బాట, పంటసాగుపై చర్చలు జరపాలి. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయాలి. వ్యవసాయ, అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించాలి. క్షేత్ర సమస్యలకు తక్షణమే పరిష్కారం సూచించాలి. తక్కువ పెట్టుబడి, అధిక ఉత్పత్తి, ఎక్కువ నికర ఆదాయం దిశగా ప్రోత్సహించాలి.
మిగతా అధికారులు ఎక్కడ?
‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులతోపాటు అనుబంధ శాఖలైన హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీష్, వెటర్నరీశాఖ, మార్కెటింగ్ అధికారులు, విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, విద్యుత్, జలవనరుల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది. వారితో పాటు రైతుమిత్ర సంఘాలు, భూసార పరిరక్షణ అధికారులు హాజరై వ్యవసాయ అభివృద్దికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, రాయితీ, సబ్సిడీలను వివరించి రైతుల్లో చైతన్యం పెంచాలి. 2024–25 ఏడాదికి సంబంధించి సెప్టెంబరు 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి విడత షెడ్యూల్ పూర్తయి ప్రస్తుతం రెండో విడత షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటి షెడ్యూల్‌లో జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. మిగిలిన శాఖ అధికారుల జాడ లేదని రైతులు వాపోతున్నారు.
ముందస్తు సమాచారం లేక కార్యక్రమం డీలా!
ఏ రోజు ఏ గ్రామంలో కార్యక్రమం జరుగుతుందో గ్రామాల్లో ముందస్తు సమాచారం లేకపోవడంతో రైతులు ఎవరి పనుల్లో వారు ఉంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు వారి షెడ్యూల్ ప్రకారం గ్రామాలకు వెళ్లి అటుగా వచ్చి వెళ్లే రైతులను కూర్చోబెట్టి కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విత్తు నుంచి ఉత్పత్తి వరకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై చాలా మందికి అవగాహన భ్రమగానే మారిందని విమర్శలు ఉన్నాయి.
అనుబంధ శాఖల అధికారులు హాజరు కావాలి
‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అన్ని అనుబంధ శాఖ ల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి. ఆయా శాఖల పథకాలను తెలియజేసి, రైతుల సమస్యలు పరిష్కరించాలి. అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యేలా చర్యలు చేపడతాం.
– రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment