దొంగల వీరవిహారం..!
గజపతినగరం: మండల కేంద్రంలో శుక్రవారం వేకువజామున మూడుగంటల ప్రాంతంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో 8షాపుల షట్టర్లను ధ్వంసం చేసి నగదు, వస్తుసామగ్రి చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గజపతినగరంలో ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న 8షాపులను దొంగలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ 8షాపుల్లో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వెంకి మొబైల్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ షాపులో 27సెల్‌ఫోన్‌లు, రూ.లక్షా51వేల420 నగదు చోరీకి పాల్పడినట్టు షాపు యజమాని తెలిపారు. దీంతో పాటు గజపతినగంలో డీ మార్ట్స్, ఆర్‌కే ఫ్యామిలీ మార్ట్, సూపర్ ఎం, ఉమెన్స్/కిడ్స్ జోన్, ఎస్‌ఎస్ ఫుట్ వేర్, వెంకటేశ్వర కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, తిరుమల ట్రేడర్స్, ఎస్‌ఎస్ ఫుట్‌వేర్ మొత్తం 8షాపుల షట్టర్లను ధ్వంసం చేసి కౌంటర్‌లలో ఉన్న నగదు, వస్తువులను దొంగిలించారు. ఉమెన్/మెన్/కిడ్స్ జోన్ బట్టల షాపులో కౌంటర్‌లో ఉన్న నోట్లు రూ.10వేలు, చిల్లర రూ.5వేలు మొత్తం రూ.15వేలు పోయినట్లు యజమాని ఆగూరు ఆచారి తెలిపారు. అలాగే మిగతా షాపుల్లో కూడా కొంత నగదు, వస్తువులు పోయినట్లు బాధితులు తెలిపారు.
సంఘటనా స్థలానికి డీఎస్పీ, క్లూస్ టీమ్
గజపతినగరం టౌన్‌లోను, మెంటాడ జంక్షన్‌లో చోరీకి గురైన 8షాపులను డీఎస్పీ భవ్య క్షేత్ర స్థాయిలో పరిశీలించి దొంగతనం జరిగిన తీరును స్థానిక సీఐ జీఏవీ రమణ, ఎస్సై లక్ష్మణరావులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూస్‌టీమ్ ద్వారా వివరాలను, ఫింగర్ ప్రింట్‌లను తీయించి దర్యాపు చేశారు. సీసీఫుటేజీల ద్వారా దొంగలను గుర్తించి వారిజాడ కనిపెట్టి అదుపులోకి తీసుకునేలా దర్యాప్తు చేయాలని స్థానిక ఎస్సై లక్ష్మణరావును ఆదేశించారు. సీసీ ఫుటేజీల్లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే కనిపిస్తున్నారు. 8షాపులను ఒకేరోజు షట్టర్లు పగులగొట్టి లోపలికి ఎలా ప్రవేశించారో అంతుపట్టని విధంగా సినీఫక్కీలో చోరీ జరిగినట్లు ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. డీఎస్పీ భవ్య వెంట క్లూస్ టీమ్ సిబ్బందితో పాటు స్థానిక సీఐ, ఎస్సైలు జీఏవీ రమణ, లక్ష్మణరావులు ఉన్నారు.
పోలీసుల వైఫల్యానికి నిదర్శనం: సీపీఎం
గజపతినగరం: ఎన్నడూ లేనివిదంగా ఒకేరోజు గజపతినగరంలో 8షాపుల్లో చోరీ జరగడం పోలీసుల వైఫల్యమేనని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.లక్ష్మి, జి.శ్రీనివాస్, రాకోటి రాములు విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం గజపతినగరం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. వ్యాపారులను భయబ్రాంతులకు గురి చేసే విధంగా దొంగతనాలు జరగడం దుర్మార్గమన్నారు. గజపతినగరంలో గంజాయి, బెట్టింగులజోరు, మత్తులో తగాదాలు, కత్తులతో పొడుచుకునే సంఘటనలు, ఏసమయంలోనైనా మద్యం దొరకడం వంటివి పెరిగి పోవడంతో సమాజం పూర్తిగా ఛిన్నాభిన్నం అయిపోయిందన్నారు. దీనిని గాడిలో పెట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. 8షాపుల్లో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు వేగవంతంగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
గజపతినగరంలో 8 షాపుల్లో చోరీ
షాపుల షట్టర్లు ధ్వంసం నగదు,
వస్తు సామగ్రి అపహరణ
దొంగల వీరవిహారం..!
Comments
Please login to add a commentAdd a comment