ఇది మోసపూరిత బడ్జెట్
వంగర: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి మోసపూరితంగా ఉందని.. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయింపులకు పొంతనే లేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడమే కూటమి ప్రభుత్వ ఉద్దేశమని మండిపడ్డారు. మండలంలోని కోనంగిపాడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతేడాది సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని.. ఈ ఏడాది బడ్జెట్‌లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూస్తుంటే.. ఆ పథకాల అమలుపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు కేటాయింపులు లేకపోవడం అన్యాయమన్నారు. 50 ఏళ్లు పైబడిన బీసీలకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ప్రజలు సీఎం చంద్రబాబును నమ్మి మోసపోయారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేదల పక్షపాతి అని.. పేదల సంక్షేమానికి ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టలేదని తెలిపారు. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా పేరుమార్చి పథకాన్ని పూర్తిగా నీరుగార్చారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్ల కేటాయింపులు చేయడమే వారి మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందని తెలిపారు. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు, లోకేష్‌లను పొగిడే దుస్థితికి దిగజారారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, సర్పంచ్‌లు చందక తాతబాబు, నెయిగాపుల శివరామకృష్ణయ్య, పార్టీ నాయకులు కనగల పారినాయుడు, వేమిరెడ్డి సూర్యనారాయణ, బెవర నూకంనాయుడు, యలకల వాసునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
Comments
Please login to add a commentAdd a comment