ఎకై ్సజ్ గుట్టు రట్టు అయ్యేనా?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎకై ్సజ్ శాఖలో భారీ స్థాయిలో వసూళ్లకు పాల్ప డిన ఓ ఉన్నతాధికారి గురించి గుట్టుగా విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. విజయనగరంలోని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఉదయం నుంచి విచారణ సాగింది. జిల్లాలో ఒక్కో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలో ఇద్దరేసి మద్యం షాపు లైసెన్స్‌దారులను రప్పించి విచారణ జరిపారు. ఇదే అదనుగా విచారణలో ఏం చెప్పాలో ఆయా సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు సదరు మద్యం షాపుల లైసెన్స్‌దారులకు ముందుగానే బెదిరించి మరీ ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అలా సదరు ఉన్నతాధికారిపై ఈగ కూడా వాలకుండా జాగ్రత్త పడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉభయ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో మద్యం షాపుల లైసెన్స్‌దారుల నుంచి మామూళ్లు వసూలు చేసిన వ్యవహారాన్ని గత జనవరి నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఎకై ్సజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి రెండు జిల్లాలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు రూ.4 కోట్ల వరకూ వసూలు చేయాలని టార్గెట్ పెట్టిన విషయాన్నీ బహిర్గతం చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. అందులో భాగంగానే అడిషినల్ డైరెక్టర్ దేవకుమార్ విజయనగరం వచ్చారు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోనే విచారణ ప్రారంభించారు. ఒక్కో సీఐ ఇద్దరేసి చొప్పున మద్యం దుకాణాల లైసెన్స్‌దారులను తీసుకురావాలని చెప్పడంతో జిల్లా అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. విచారణకు హాజరైన లైసెన్సీలు ఏం చెప్పారనేదే ఇప్పుడు కీలకంగా మారింది.
మద్యం షాపు లైసెన్స్‌దారుల నుంచి అక్రమ వసూళ్లపై ఆరా
ఒక్కో సీఐ పరిధిలో ఇద్దరేసి చొప్పున
లైసెన్స్‌దారులకు పిలుపు
డీసీ కార్యాలయంలోనే గుట్టుగా విచారణ
Comments
Please login to add a commentAdd a comment