
మనిషికి వినికిడి ప్రధానం
● 5 నుంచి 10 శాతం మందికి పుట్టుకతో వినికిడి సమస్య
● 10 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స
తీసుకున్న శిశువులకు వినికిడి సమస్య వచ్చే అవకాశం
● త్వరగా గుర్తించకపోతే మూగ,
చెవిడు బారిన పడే ప్రమాదం
విజయనగరం ఫోర్ట్: మానవుడికి కళ్లు ఎంతటి ప్రాధాన్యమైనవో చెవులు కూడా అంతటి ప్రాధాన్యమైనవే. వినికిడి సమస్య ఉంటే ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. వినికిడి సమస్యను త్వరగా గుర్తించగలగాలి. లేదంటే చెవుడుతో పాటు మూగ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శిశువులకు పుట్టకతో వినికిడి సమస్య వచ్చే ఆస్కారం ఉంది. సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. భారతదేశం జనాభాలో 5నుంచి 10 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. జిల్లాకు సంబంధించి 5 నుంచి 10 శాతం వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువులు వారం నుంచి 10 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందే పరిస్థితి ఉంటే వినికిడి సమస్య బారిన పడే అవకాశం ఉంది. 40 ఏళ్లు దాటిన వారు కూడా వినికిడి సమస్య బారిన పడే అవకాశం ఉంది.
సమస్యను త్వరగా గుర్తించాలి
నవజాత శిశువుల్లో వినికిడి సమస్యను త్వరతిగతిన గుర్తించాలి. త్వరగా గుర్తించకపోతే మూగ, చెవుడు సమస్యల బారిన పడతారు. అదేవిధంగా భాష కూడా అభివృద్ధి చెందదు. పుట్టిన ప్రతి నవజాత శిశువుకు వినికిడి సమస్య ఉందా? లేదా? అని స్క్రీనింగ్ చేయించాలి. స్క్రీనింగ్‌లో వినికిడి సమస్య ఉన్నట్లు అనిపిస్తే, వినికిడి లోపం ఎంత ఉందో తెలుసుకునేందుకు బెరా టెస్టు చేయించాలి.
వినికిడి సమస్యకు కారణాలు:
నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. మేనరికం వివాహం చేసుకునే వారికి పుట్టే శిశువులకు వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన లోపాల వల్ల, క్రోమోజోముల్లో తేడా వల్ల సౌండ్ పొల్యుషన్ వల్ల వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. అతిగా సెల్‌ఫోన్లు వినియోగించడం వల్ల కూడా వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. వినికిడి సమస్యలతో అనేక మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. వినికిడి మెషీన్‌ల ద్వారా సమస్య కొంతవరకు తీరుతుంది. కొంతమందికి శస్త్రచికిత్సలు చేయడం వల్ల సమస్య తీరుతుంది.
పుట్టిన నెల లోపు శిశువులకు
స్క్రీనింగ్ చేయించాలి:
నవజాత శిశువులకు పుట్టిన నెలలోగా వినికిడి సమస్యను తెలుసుకునేందుకు స్క్రీనింగ్ చేయించాలి. పుట్టిన మూడు నెలల లోపు బెరా టెస్టు చేయించాలి. పుట్టిన ఆరు నెలల లోపు ఆపరేషన్ చేయించడం గాని మెషీన్ పెట్టించడం గానీ చేయాలి. అతిగా సెల్ ఫోన్ వినియోగించకూడదు. వినికిడి సమస్యలను ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది. నిర్లక్ష్యం చేస్తే వినికిడి సమస్యతో పాటు మాటలు రాని పరిస్థితి వస్తుంది. డాక్టర్ బి.అజయ్‌కుమార్,
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈఎన్‌టీ విభాగం

మనిషికి వినికిడి ప్రధానం

మనిషికి వినికిడి ప్రధానం
Comments
Please login to add a commentAdd a comment