కార్డు రాదు.. సరుకులు అందవు
రైస్ కార్డు... పేద, మధ్య తరగతి కుటుంబాలకు అతి విలువైనది. రేషన్ సరుకులతో పాటు పిల్లల చదువులకు ఆర్థిక సాయం, ప్రభుత్వ రాయితీలు మంజూరుకు ఆ కార్డే ఆధారం. ఏడాదిగా కొత్త కార్డులు మంజూరు కాక.. పిల్లల పేర్లు కార్డులో చేర్పించే అవకాశం లేక.. ప్రభుత్వ ప్రయోజనాలు అందక పేద ప్రజలు మనోవేదన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఆరు నెలలకోసారి కొత్త కార్డులు మంజూరు చేసేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఒక్క కార్డు కూడా మంజూరు చేయకపోవడంపై మండిపడుతున్నారు. మంచి చేస్తామని చెప్పి ముంచేస్తోందని విమర్శిస్తున్నారు.
విజయనగరం ఫోర్ట్:
ప్రజా సంక్షేమమే ప్రధానమన్నారు.. సూపర్ సిక్స్‌తో ఊరించారు.. హామీల వర్షం కురిపించారు.. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారంటూ కూటమి నేతల తీరుపై జనం మండిపడుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన రైస్‌కార్డుల మంజూరులో ప్రభుత్వ అలసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దరఖాస్తు చేసుకుని నెలలు తరబడుతున్నా కొత్తకార్డులు మంజూరు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024 మార్చి15వ తేదీ వరకు జిల్లాలో కొత్త రైస్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు, సభ్యులను రైస్ కార్డులో చేర్చడానికి, కార్డులు విభజనకు అవకాశం ఉండేది. సచివాలయంలో దరఖాస్తులు స్వీకరించేవారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క రైస్‌కార్డు కూడా మంజూరు కాలేదు. వేలాది జంటలు కొత్తకార్డుల కోసం ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోయింది. రైస్ కార్డుల్లో కుటుంబ సభ్యులు పేర్లు చేర్పించేందుకు అవకాశం లేకపోవడంతో ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు.
దరఖాస్తు చేసిన వెంటనే...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త రైస్ కార్డుల మంజూరు, పిల్లల పేర్లు చేర్పించడం, కార్డుల విభజన కోసం నిరంతరాయంగా దరఖాస్తులు స్వీకరించేది. ప్రతీ ఆరు నెలలకోసారి కొత్త కార్డులు మంజూరు చేసేది. పిల్లల పేర్లు, కార్డుల విభజన పనులు దరఖాస్తు చేసిన వెంటనే సచివాలయ సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకెళ్లి చక్కబెట్టేవారు. ఇప్పడు ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు. రేషన్ సరుకుల సరఫరా, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాల భారాన్ని తగ్గించుకునేందుకే కొత్త కార్డులు మంజూరు చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొత్తకార్డులు మంజూరు కాలేదు
జిల్లాలో కొత్తగా రైస్ కార్డులు ఎవరికీ మంజూరు కాలేదు. కొత్త రైస్ కార్డు కోసం, రైస్ కార్డులో సభ్యుల పేర్లు చేర్చడానికి ప్రభుత్వం నుంచి ఇంకా ఆప్షన్ రాలేదు.
– కె.మధుసూదనరావు,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
‘గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన జి.చిన్నమ్మలు 2024 మార్చి 4వ తేదీన రైస్ కార్డు కోసం దరఖాస్తు చేశారు. ఏడాదిగా ఎదురుచూస్తున్నా ఇంతవరకు ఆమెకు రైస్ కార్డు మంజూరు కాలేదు.’
గంట్యాడ మండలానికి చెందిన వి.భీమేశ్వరావు తన భార్య, పిల్లలను రైస్ కార్డులో చేర్చడానికి 2024 ఫిబ్రవరి 7వ తేదీన దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు రైస్ కార్డులో అతని కుటుంబ సభ్యుల పేర్లు చేరలేదు. రేషన్ సరుకులు అందడం లేదు.
కొత్త కార్డులు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం
దరఖాస్తు చేసుకునేందుకూ అవకాశం లేని పరిస్థితి
జిల్లాలో 10 వేల మంది ఎదురుచూపు
సంక్షేమ పథకాలు, చదువు పత్రాలకు ఇబ్బందులు
జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల మంది కొత్త రైస్ కార్డులు, రైస్ కార్డుల విభజన, సభ్యుల పేర్లు చేర్చడం కోసం ఎదురు చూస్తున్నారు. 9 నెలలుగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోతోంది. దరఖాస్తు చేసుకునే ఆప్షన్ లేదని సచివాలయ సిబ్బంది చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. పింఛన్లు, ఇళ్లు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల మంజూరు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర ప్రయోజనాల కోసం రైస్ కార్డు తప్పనిసరని, కార్డుల మంజూరులో కూటమి ప్రభుత్వ అలసత్వం తగదంటూ బహిరంగంగా విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment