
నేటి నుంచి వేంకటేశ్వరుని కల్యాణోత్సవం
డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేంచేసి ఉన్న వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. స్వామివారి 41వ వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ శ్రీనివాసుని కల్యాణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. 9వ తేదీ ఉదయం నుంచి స్వామివారి కల్యాణ ఉత్సవ పూజలు ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి తిరువీధి ఉత్సవం జరుగుతుందని వివరించారు. 10వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 11వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న సమారాధన జరుగుతుందని కమిటీ తెలిపింది. భక్తులు పాల్గొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలని వారు కోరారు. ఉత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ
Comments
Please login to add a commentAdd a comment