23న వయోజనులకు అక్షరాస్య అర్హత పరీక్ష
విజయనగరం అర్బన్: జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన వయోజనులకు అక్షరాస్య అర్హత పరీక్ష (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్)ను ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. తన చాంబర్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పరీక్ష నిర్వహణపై జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ఉల్లాస్ కార్యక్రమంలో జిల్లాలో 48 వేల మంది అక్షరాస్యత కోర్సుపై శిక్షణ పొందారని, వీరి అర్హత పరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 875 పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. పరీక్షను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో నచ్చిన సమయంలో 3 గంటల పాటు నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లుగా అర్హత కలిగిన అంగన్‌వాడీ టీచర్లను నియమించాలని అధికారులకు సూచించారు. పరీక్షల పరిశీలకులుగా డీఆర్‌డీఏ ఏపీఎంలను నియమించాలన్నారు. వీరి పరీక్ష అనంతరం జవాబు పత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, హాజరు పత్రాలు, మార్క్స్ అవార్డు సీట్‌లు నిర్దేశిత ప్రొఫార్మాలో ఎక్సెల్ షీట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. సమావేశంలో వయోజన విద్య డీడీ అల్లు సోమేశ్వరరావు, ఐసీడీసీ ఇన్‌చార్జి పీడీ ప్రసన్న, డీఆర్‌డీఏ ఏపీడీ సావిత్రి, వయోజన విద్యాశాఖ ఏపీఓ ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం
5 గంటల మధ్య నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment