● డీసీహెచ్‌ఎస్ రాజ్యలక్ష్మి
విజయనగరం ఫోర్ట్: జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వ య అధికారి (డీసీహెచ్‌ఎస్) పరిధిలో 12 కేడర్లకు సంబంధించి 23 పోస్టులకు 2,503 దరఖాస్తులు వచ్చాయని డీసీహెచ్‌ఎస్ జి.వి.రాజ్యలక్ష్మి తెలిపారు. బయో స్టాటిస్టియన్ ఒక పోస్టుకు 46 దరఖాస్తులు, ల్యాబ్ టెక్నీషియన్ 2 పోస్టులకు 268, ఆడియో మెట్రిషిన్ 4 పోస్టులకు 15, రేడియాగ్రాఫర్ ఒక పోస్టుకు 51, ఫిజియోథెరపిస్టు 2 పోస్టులకు 84, బయోమెడికల్ ఇంజినీర్ ఒక పోస్టుకు 33, థియేటర్ అసిస్టెంట్ 3 పోస్టులకు 168, మెడికల్ రికార్డు అసిస్టెంట్ ఒక పోస్టుకు 388, ల్యాబ్ అటెండెంట్ 2 పోస్టులకు 128, ఎలక్ట్రీషియన్ ఒక పోస్టుకు 115, జనరల్ డ్యూటీ అటెండెంట్ 10 పోస్టులకు 1177, ప్లంబర్ ఒక పోస్టుకు 30 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎంపిక పక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.
చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్ 2024–25 సీజన్‌లో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 487 రైతు సేవా కేంద్రాల ద్వారా 72,845 మంది రైతుల నుంచి 3.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. రైతుల ఖాతాలకు రూ.768 కోట్లు ధాన్యం డబ్బులు, జీఎల్‌టీ కింద రూ.12 కోట్లు జమచేసినట్టు తెలిపారు. రైతుల వద్ద ధాన్యం మిగిలి ఉంటే ఈ నెల 31వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.
పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. అమ్మ వారి కల్యాణ మండపం ఆవరణలో నిర్వహించిన లెక్కింపు ప్రక్రియను ఆలయ ఇన్‌చార్జి ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు. 86 రోజులకు చదురుగుడి హుండీల నుంచి రూ.34,51,576లు, 35 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బంగారం, 449 గ్రాముల వెండి, వనంగుడి హుండీల నుంచి రూ.9,43,375లు, 6 గ్రాముల 400 మిల్లీ గ్రాముల బంగారం, 682 గ్రాముల వెండి లభించిందని ప్రసాద్ తెలిపారు. అన్నదానం హుండీల నుంచి రూ. 45,823లు వచ్చిందన్నారు. కార్యక్రమంలో రామతీర్థం ఆలయ సహాయ కమిషనర్ వై.శ్రీనివాసరావు, శ్రీవారి సేవకులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
డీసీహెచ్‌ఎస్ పోస్టులకు 2,503 దరఖాస్తులు