
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు
విజయనగరం ఫోర్ట్:
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. గరివిడి మండలం శివరాం గ్రామానికి చెందిన కోండ్రు అఖిల అనే 18 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన ఓ నిందితుడు కత్తితో దాడి చేయడంతో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను జెడ్పీ చైర్మన్ శనివారం ఆస్పత్రిలో పరామర్శించారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అధైర్య పడొద్దని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చులకోసం పార్టీ తరఫున రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిలపై దాడిఘటన విషయాన్ని తెలుసుకున్న మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ యువతిని పరామర్శించి, అండగా ఉండాలని చెప్పారన్నారు. కొద్దిరోజుల కిందట భీమిలి నియోజకవర్గంలో కూడా ఓ యువతి తల్లిని చంపేశారని, యువతి ప్రాణాప్రాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఇదే నియోజకవర్గంలో చిన్నారిపై ఓ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డడాని చెప్పారు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని 12 రోజులపాటు ప్రాణాలతో పోరాడి చనిపోయిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. వీధిరౌడీల్లా మహిళలపై తెగబడుతున్నారన్నారు. పట్టపగలే ఇళ్లలోని చొరబడి దాడులుకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి భయానక పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రాజమండ్రి నిందితుడిని ఇంతవరకు పట్టుకోలేదన్నారు. మహిళలపై రోజుకి 60, 70 సంఘటనలు జరుగుతుండడం విచారకరమన్నారు. ఆడపిల్లలపై చేయివేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని కూటమి నేతలు చెప్పారని, మరి ఇంతవరకు ఎంతమందని శిక్షించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పగలు కూడా మహిళలు రోడ్డుపై ప్రయాణించేందుకు భయపడే పరిస్థితులు నెలకున్నాయన్నారు. గ్రామాల్లో కిళ్లీ బడ్డీల్లో కూడా మద్యం ఏరులై పారుతోందన్నారు. గంజాయి నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దిశయాప్ ఉండేదని, ఆ యాప్ ఫోన్‌లో ఉండడం వల్ల మహిళలకు రక్షణ ఉండేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వమే అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనడం హాస్యా స్పదంగా ఉందన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారని ఆరోపించారు. ఆస్పత్రి వార్డుల్లో పర్యటిస్తే కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుతీరు మంత్రికి బోధపడుతుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు అమ్మవడి, ఫీజురీయింబర్స్‌మెంట్, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు విద్యార్థుల చదువుకు అండగా ఉండేవన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఫీజులు చెల్లించలేక చదువుకు స్వస్థిచెప్పే పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ ఘనతను కూటమి ప్రభుత్వం మూటగట్టుకుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్యలత, గరివిడి ఎంపీపీ మీసాల విశ్వేశరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
మహిళలపై వీధి రౌడీల్లా
తెగబడుతున్నారు
పట్టపగలే మహిళలు రోడ్డుపై తిరగలేని పరిస్థితి
మద్యం ఏరులై పారుతోంది..
కిళ్ల్లీ బడ్డీల్లో కూడా మద్యం దొరుకుతోంది
గంజాయి నియంత్రణలోనూ విఫలం
ఆడ పిల్లలపై చేయివేస్తే అది చివరి రోజు అన్నారు..
మరి ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో కూటమి నేతలు చెప్పాలి..
జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
కత్తిదాడికి గురైన యువతికి పరామర్శ
వైఎస్సార్‌సీపీ తరఫున రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేత