
మంత్రి ఇలాకాలో మట్టిమాఫియా
● స్థానిక టీడీపీనేత అండతో దందా
● యథేచ్ఛగా తరలింపు
● చోద్యం చూస్తున్న అదికారులు
గజపతినగరం రూరల్: నియోజకవర్గంలోని మరుపల్లి గ్రామం మధ్యలో ఉన్న కోనేటిలోనుంచి గడిచిన కొన్ని రోజులుగా మట్టిమాఫియా రెచ్చిపోతోంది. సహజ వనరులను దోచేస్తు అడ్డదిడ్డంగా టీడీపీ తమ్ముళ్లు సంపాదించుకుంటన్నారు. గ్రామం మధ్యలో ఉన్న కోనేటిలోని మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
మట్టిమాఫియాకు కేరాఫ్ మరుపల్లి
నియోజకవర్గంలోని మరుపల్లి గ్రామంలో గతంలో ఆదర్శపాఠశాలను ఆనుకుని ఉన్న కొండనుంచి మట్టిని అక్రమంగా తరలించి గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు సొమ్ముచేసుకున్నారు. పగటిపూట అయితే ఎవరి కంటైనా పడతామని రాత్రి సమయంలో జేసీబీలతో అక్రమంగా మట్టిని తరలించేవారు. ప్రస్తుతం కొండప్రాంతంలో మట్టి తరలింపునకు పుల్‌స్టాప్ పెట్టడంతో నేరుగా గ్రామంలో ఉన్న కోనేటి చెరువుపై పడ్డారు.
అనుమతులు ఏవీ?
గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన ఏ ప్రాంతం నుంచైనా మట్టిని తీయాలంటే స్థానిక పంచాయతీ అనుమతులు, తీర్మానం ఉండాలి. అలాగే రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది కూడా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండానే నేరుగా మట్టిని తరలించేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది.
పంచాయతీ అనుమతులు ఇవ్వాలి
గ్రామంలోని చెరువుల్లోంచి మట్టిని తీసుకోవాలంటే స్ధానిక పంచాయతీ అనుమతులు తీసుకోవాలి. రెవెన్యూ నుంచి మట్టి తరలించేందుకు ఎవరీకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు.
– రత్నకుమార్ తహసీల్దార్
సర్పంచ్ భర్త తోలుకోమన్నారు
కోనేరులోని దెప్పులుగా ఉన్న మట్టిని స్థానిక సర్పంచ్ భర్త సత్యనారాయణ తీసుకెళ్లమన్నారు. ఆయన చెప్పారని మట్టిని ట్రాక్టర్‌తో తీసుకెళ్తున్నాం.
– గౌరినాయుడు, మట్టి తరలింపుదారు
కోనేరు లోతు అవుతుందని
గ్రామంలో ఉన్న కోనేరులో మట్టి తరలిస్తే లోతు ఎక్కువవుతుందని చెప్పాం. మట్టి తరలింపునకు ఎటువంటి తీర్మానం చేయలేదు.డబ్బులు ఎవరి దగ్గరా తీసుకోలేదు.
– లెంక సత్యనారాయణ, టీడీపీ నాయకుడు
మరుపల్లి