
ప్రాథమిక రంగంలోనే అభివృద్ధి అవకాశాలు అధికం
బొబ్బిలి: ప్రాథమిక రంగంలోనే అభివృద్ధి అవకాశాలు ఎక్కువని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో విజన్ ప్లాన్‌పై అవగాహన, నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలో తలసరి ఆదాయాన్ని 15 శాతం పెంచేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కేవలం ప్రణాళిక రూపకల్పనే కాకుండా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ, లక్ష్య సాధన ఉండాలన్నారు. వ్యవసాయ యోగ్యమైన భూమి 3 లక్షల ఎకరాల వరకు ఉండగా, సాగు మాత్రం కేవలం లక్ష ఎకరాల్లోనే ఉందన్నారు. మిగిలిన భూమిని దశల వారీగా సాగులోకి తీసుకురావాలని సూచించారు. ఉద్యాన, వాణిజ్య పంటలను సాగు చేయాలని చెప్పారు. గుడ్లు, పాలు, మాంసం ఉత్పత్తిని పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న చెరువుల్లో చేపలు పెంచాలన్నారు. సేవారంగం విస్తరణకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటైతే ఈ రంగాల్లో అభివృద్ధి మరింత కనిపిస్తుందని చెప్పారు. గ్రామస్థాయి అధికారులంతా తమ సొంత ప్రాంతంగా భావించి ఆ స్థాయిలోనే ప్రణాళికలు రూపొందించాలన్నారు. దీనికోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీపీఓ పి.బాలాజీ, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ వై.వి.రమణ, ఉద్యానవన శాఖ డీడీ ఏవీఎస్‌వీ జమదగ్ని, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ, మత్స్యశాఖ ఇన్‌చార్జి డీడీ విజయకృష్ణ, బొబ్బిలి ప్రత్యేకాధికారి నూకరాజు, ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహనరావు, ప్రకృతి వ్యవసాయ డీపీఓ ఆనందరావు, నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. అంతకు ముందు వివిధ స్టాల్స్‌ను కలెక్టర్ సందర్శించి పలు సూచనలు చేశారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్