ఇసుక నిల్వలు సీజ్
వనపర్తి: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక నిల్వలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం పెబ్బేరు మండలం రాంపురం గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 400 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్‌తో కలిసి సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేయగా అక్రమ ఇసుక నిల్వలు బయటపడ్డాయని.. వెంటనే సీజ్ చేయాలని, డంప్ చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమంగా రవాణా చేసే ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేయాలని ఆర్డీఓకు సూచించారు.
ఆర్డీఓ విచారణ
పాన్‌గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లిలో సర్వేనంబర్ 576 పట్టా స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటుపై స్థల యజమాని శ్రీనివాసాచారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఆర్డీఓ సుబ్రమణ్యం మండలస్థాయి అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. సొంత స్థలంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని తొలగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని, గతంలో అధికారులు, పాలకులు ధౌర్జన్యంగా స్థలంలో క్రీడా మైదానం ఏర్పాటు చేశారని బాధిత కుటుంబసభ్యులు అధికారులకు వివరించారు. గ్రామస్తులు పలువురిని విచారించిన ఆర్డీఓ పూర్తి వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తామని పేర్కొన్నారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, సర్వేయర్, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇసుక నిల్వలు సీజ్
Comments
Please login to add a commentAdd a comment