
విశ్వసనీయత ఏది..?
పెబ్బేరు గోదాంలో అగ్నిప్రమాదం జరిగి పది నెలలు
వనపర్తి: పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో గన్నీబ్యాగులు నిల్వచేసిన ఓ గోదాంలో మంటలు చెలరేగి సుమారు రూ.20 కోట్ల నష్టం వాటిల్లిన సంగతి పాఠకులకు విధితమే. ఈ ఘటన జరిగి సుమారు 10 నెలలు గడుస్తున్నా.. కారకులు ఎవరనే విషయాన్ని నేటికీ పోలీసులు గుర్తించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోట్ల ప్రజాధనం వృథా అయిన ఘటనపై విచారణ మందకొడిగా సాగడమేమిటనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా.. ఈ విషయంపై మాట్లాడేందుకు అటు పోలీసు అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు అనాసక్తి చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితులను కాపాడేందుకు అధికారులు కొత్త దారులు వెదుకుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొందరు స్థానిక నాయకులు గోదాంలో భద్రపర్చిన గన్ని బ్యాగుల్లో సుమారు 7 లక్షలు ఇతర జిల్లాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారన్న విషయాన్ని వెలుగులోకి రాకుండా రూ.10 కోట్ల విలువైన సుమారు 12.94 లక్షల గన్ని బ్యాగులకు నిప్పు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడురోజుల పాటు మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపకశాఖ అధికారులు గోదాం గోడలను పగలగొట్టి నలువైపుల నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం చేయడంతో.. రూ.10 కోట్ల విలువజేసే గోదాం సైతం దెబ్బతింది. దీంతో ఆస్తి నష్టం విలువ సుమారు రూ.20 కోట్లకు చేరిందని ప్రాథమిక అంచనా. ఈ ఘటనపై ఇటీవల పోలీస్ అధికారులు ఇచ్చిన దర్యాప్తు నివేదికను కలెక్టరేట్ అధికారులు వెల్లడించడానికి విముఖత చూపుతున్నారు. ఇందుకు కారణాలు ఏమిటనే విషయం వారే వెల్లడించాల్సి ఉంది.
మూడురోజుల పాటు మంటలు..
విచారణ కొనసాగుతోంది..
పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌యార్డు గోదాంలో మంటలు చెలరేగి గన్ని బ్యాగులు కాలిపోయిన కేసు విచారణ కొనసాగుతోంది. కొత్తకోట సీఐ రాంబాబును విచారణ అధికారిగా నియమించాం. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన నమూనాల ఆధారంగా వచ్చిన నివేదిక ఆధారంగా విచారణ కొనసాగుతోంది. పూర్తి కాగానే వివరాలు వెల్లడిస్తాం.
– వెంకటేశ్వరరావు, డీఎస్పీ, వనపర్తి
నివేదిక చూడలేదు..
గన్నీ బ్యాగుల దగ్ధం కేసులో విచారణ నివేదికను ఇటీవలే పోలీసు అధికారులు అందజేశారు. నివేదికను ఇప్పటి వరకు చదవలేదు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం.
– జి.వెంకటేశ్వర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్
రూ.20 కోట్ల ప్రజాధనం వృథాపై
నేటికీ నిగ్గుతేలని నిజాలు
ఎండ తీవ్రతకు మంటలు
చెలరేగాయని ప్రచారం
రాజకీయ జోక్యంతో
విచారణ మలుపు తిరుగుతోందా?

విశ్వసనీయత ఏది..?

విశ్వసనీయత ఏది..?
Comments
Please login to add a commentAdd a comment