
పీఎంఎస్‌ఆర్‌ఐ నిధులు ఖర్చు చేయాలి
వనపర్తి: కేంద్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన పీఎంఎస్‌ఆర్‌ఐ, సర్వశిక్ష అభియాన్ నిధులను ఫిబ్రవరి 20లోగా వందశాతం ఖర్చు చేసి నివేదికలు అందజేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రీన్ స్కూల్, ఆత్మరక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన, మౌలిక వసతులు, స్పోర్ట్స్, సైన్స్ తదితర విభాగాలకు రూ.లక్షల్లో నిధులు విడుదల చేసినా ఖర్చులు మాత్రం జరగడం లేదన్నారు. జిల్లాలో పీఎంశ్రీ కింద 6 ప్రాథమిక పాఠశాలలు, 15 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని.. వారం రోజుల్లో నిధులు ఖర్చుచేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. అలాగే అపార్ నమోదు సైతం త్వరగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment