
వైద్యానికి వెతలు!
●
ప్రభుత్వ ఆస్పత్రులను వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
ఇబ్బందులు పడుతున్నాం..
భవనం శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడుతోంది. వర్షాకాలంలో పైకప్పు నుంచి గదుల్లోకి నీరు చేరుతోంది. సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు, సిబ్బంది కొరత ఉందని ఉన్నతాధికారులకు నివేదించాం.
– డా. హరినారాయణ,
వైద్యాధికారి, ఆత్మకూర్
● శిథిల భవనాలు.. వసతులు కరువు
● ఇబ్బందులు పడుతున్న రోగులు
ఆత్మకూర్: జిల్లాలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తుంది. పలు భవనాలు శిథిలావస్థకు చేరుకొని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆత్మకూర్, రేవల్లి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ల భవనాలు శిథిలావస్థకు చేరి పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. ఖిల్లాఘనపురం, వీపనగండ్ల, రేవల్లి, ఆత్మకూర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రులను 2022లో వైద్యవిధాన పరిషత్ పరిధిలో చేర్చి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లుగా మార్చారు. వైద్యసేవలు మెరుగుపడాల్సి ఉండగా.. రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో వివిధ విభాగాలకు సంబంధించి 16 మంది వైద్యులు, 14 మంది స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బంది, 25 మందికిపైగా కార్మికులు ఉండాల్సి ఉండగా.. నియామకాలు జరగడం లేదు. ఆత్మకూర్, వీపనగండ్ల, ఖిల్లాఘనపురం, రేవల్లి సీహెచ్‌సీలలో ఇద్దరు వైద్యులు, నలుగురు స్టాఫ్‌నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆత్మకూర్ సీహెచ్‌సీలో..
ఆత్మకూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు జిల్లాలోనే అత్యధిక సాధారణ, సిజేరియన్ ప్రసవాలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన గుర్తింపు ఉంది. ఏడాదిన్నరగా ఇక్కడి వైద్యులు బదిలీపై వెళ్లడం.. కొత్త వైద్యులు, సిబ్బంది రాక రోగులకు సరైన వైద్యసేవలు అందక వెనుకబడింది. ఆరు నెలల కిందట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడపడితే అక్కడ వర్షపు నీరు నిలవడం, గదుల్లోని చేరడం, పైకప్పు పెచ్చులూడి పడటం, గోడలకు నీరుచేరి షాక్ వస్తుందని సిబ్బంది ఆయనకు వివరించారు. మరమ్మతులకు రూ.5.60 లక్షలు మంజూరైనా కాంట్రాక్టర్ మరమ్మతులు చేయకుండానే గోడలకు రంగులు వేసి బిల్లులు ఎత్తుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సిబ్బందిని నియమించాలి..
ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి నర్వ, చిన్నచింతకుంట, దేవరకద్ర, మదనాపురం, అమరచింత ప్రాంతాల నుంచి రోగులు వచ్చేవారు. ప్ర స్తుతం వైద్యులు, సిబ్బంది లేక, సరైన వైద్యసేవలు అందక రావడం పూర్తిగా తగ్గిపోయింది. దీనికితోడు ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మించడంతో పాటు వైద్యులు, సిబ్బందిని నియమించాలి.
– రాజు,
సీపీఎం మండల కార్యదర్శి, ఆత్మకూర్
స్థల పరిశీలన పూర్తి..
ఆత్మకూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సందర్శించాం. డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి పీజేపీ క్యాంపులో 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశాం. మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అనుమతులు వచ్చి పనులు ప్రారంభమవుతాయి.
– వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్
త్వరలోనే నియామకాలు..
జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో వైద్యు లు, సిబ్బంది కొరత ఉంది. వైద్య విధాన పరిషత్ నుంచి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ల క్యాడర్ స్ట్రెంత్ నియామక వివరాలు వెలువడ లేదు, విధివిధానాలు రావాల్సి ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో నియామకాలు చేపడతాం.
– డా. చైతన్యగౌడ్, జిల్లా సూపరింటెండెంట్, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్స్

వైద్యానికి వెతలు!

వైద్యానికి వెతలు!

వైద్యానికి వెతలు!

వైద్యానికి వెతలు!

వైద్యానికి వెతలు!
Comments
Please login to add a commentAdd a comment