
కార్చిచ్చు ముప్పు..
విలువైన చెట్లు.. ఔషధ మొక్కలు
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా నల్లమల అమ్రాబాద్ అభయారణ్యం గుర్తింపు పొందింది. ఇక్కడ ఔషధ మొక్కలతోపాటు టేకు, నల్లమద్ది, వేప, చేదు వేప, ఇప్ప తదితర చెట్లు అధికంగా ఉన్నాయి. వేసవి ప్రారంభంలోనే ఆకులు రాలి ఎండిపోయాయి. వాహనాల్లో వెళ్తున్న వారు సిగరెట్, బీడీలు తాగి.. పూర్తిగా ఆర్పకుండానే రోడ్డు పక్కనున్న అడవుల్లోకి విసురుతుంటారు. మరోవైపు పశువుల కాపరులు, అడవుల్లోకి ప్రవేశించే ఇతర వ్యక్తులు సైతం చుట్ట, బీడీ, సిగరెట్లు కాల్చిన అగ్గిపుల్లలను నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. తద్వారా మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది.
అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ ముందస్తు చర్యలు
● క్విక్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు
● వీవ్‌లైన్స్, ఫైర్‌లైన్స్‌తో మంటల అదుపు
● అటవీ సమీప గ్రామాల్లో అవగాహన సదస్సులు
● నల్లమలలో విలువైన ఔషధ మొక్కలు, వన్యప్రాణులు
అచ్చంపేట: వేసవి నేపథ్యంలో నల్లమలలోని వన్యప్రాణులతోపాటు విలువైన అటవీ సంపదకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అడవుల్లో చెట్ల ఆకులు రాలే సీజన్. చెట్ల నుంచి కింద పడిన ఆకులు ఎండిపోవడంతోపాటు కుప్పలుగా కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో వాటిపై నిప్పు పడితే కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. తద్వారా అటవీ సంపదతోపాటు వన్యప్రాణులకూ ముప్పు వాటిల్లుతోంది. అయితే జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ విపత్తును నివారించవచ్చని భావిస్తున్న అటవీశాఖ అధికారులు.. జిల్లాలోని అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. అడవి బుగ్గిపాలు కాకుండా కాపాడుకునేందుకు ముందస్తుగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారికి ఇరువైపులా వీవ్‌లెన్స్, ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం అటవీశాఖ సిబ్బందితో అడవిలో ఎండిన ఆకులను వరుసగా పేర్చి కాల్చివేస్తున్నారు. ఒకవేళ అగ్గి రాజుకున్నా శరవేగంగా విస్తరించకుండా ఈ ఫైర్ లైన్స్‌తో అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.
నల్లటి రంగుతో సరిహద్దు
వేసవిలో చెట్ల ఆకులు రాలడం వల్ల చిన్నపాటి నిప్పురవ్వ పడినా అడవి దావనంలా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది నేలపై రాలిన చెట్ల ఆకులను ఒకచోట పోగు చేసి.. కిలోమీటర్ పొడవునా కాల్చుతున్నారు. తద్వారా నిప్పు అంటుకున్నా మంటలు విస్తరించవు. మరోవైపు నల్లటి రంగుతో సరిహద్దు గీత ఏర్పడి వన్యప్రాణులు సైతం అడవి దాటి బయటకు వెళ్లకుండా ఫైర్‌లైన్స్ ఉపయోగపడతాయి.
శాటిలైట్ సహాయంతో..
నల్లమల అటవీ ప్రాంతంలో అగ్గి అంటుకున్న వెంటనే ఆర్పేందుకు వీలుగా అటవీశాఖ అధికారులు తక్షణ స్పందన (క్విక్ రెస్పాన్స్) బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రేయింభవళ్లు ఎక్కడ అగ్గి రాజుకున్నా శాటిలైట్ సహాయంతో ప్రమాదాన్ని గుర్తించి.. మంటలను ఆర్పివేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మరోవైపు అటవీ సమీప గ్రామాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అమ్రాబాద్ టైగర్
రిజర్వు పరిధి2,166.37 చ.కి.మీ.,
అటవీ విస్తీర్ణం 2,611.39
చ.కి.మీ.,
బఫర్ జోన్ (ఏటీఆర్) 445.02
చ.కి.మీ.,
మొత్తం ఫారెస్టు బ్లాకులు
25
నల్లమల అటవీ
ప్రాంతం
ఇలా..
కఠిన చర్యలు..
ఎవరైనా అడవిలో నిప్పు పెట్టినట్లు తేలితే అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. అడవులు అగ్నిప్రమాదాల బారిన పడకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాం. వీవ్‌లైన్స్, ఫైర్‌లైన్స్ ఏర్పాటుతో ఒకచోట నుంచి మరో చోటకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నాం.
– రోహిత్‌రెడ్డి, డీఎఫ్‌ఓ
నిరంతర గస్తీ..
అటవీ పరిరక్షణకు గస్తీ ముమ్మరం చేశాం. క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాం. ఆకతాయిలు, పశువుల కాపరులు, ఇతరులు అడవుల్లోకి అగ్గిపెట్టెలు తీసుకుపోకుండా అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు వెంట వెళ్లే వారు నిప్పు వేసినా అడవి కాలకుండా ఇరువైపులా 20 – 30 మీటర్ల వరకు గడ్డి, ఆకులను ముందుగానే కాల్చివేస్తున్నాం.
– గురుప్రసాద్, ఎఫ్‌ఆర్‌ఓ, దోమలపెంట

కార్చిచ్చు ముప్పు..

కార్చిచ్చు ముప్పు..
Comments
Please login to add a commentAdd a comment