
21న ‘పేట’కు సీఎం రాక
నారాయణపేట: ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేటకు రానున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె హెలీప్యాడ్ స్థలాన్ని ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి పరిశీలించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్, స్టేజీ తదితర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు, వాటిలో మెడికల్ కళాశాల టీచింగ్ హాస్పిటల్, 100 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల, రెండు పోలీస్‌స్టేషన్ల భవన నిర్మాణాలు, పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనాలు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.
అధునిక సాగుతో
అధిక దిగుబడులు
పాన్‌గల్: రైతులు ఆధునిక సాగు పద్ధతులు పాటిస్తూ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త రాజేంద్రకుమార్ సూచించారు. సోమవారం మండలంలోని దొండాయిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయశాఖ సంయుక్తంగా నిర్వహించిన గ్రామీణ అంచనా (పీఆర్‌ఏ) కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ పద్ధతులు మెరుగుపర్చడానికి రైతులకు అవసరమైన సాధనాలు, జ్ఞానాన్ని అందించడానికి కేవీకే కృషి చేస్తోందన్నారు. కూరగాయలు, పప్పు దినుసుల సాగు వైపు రైతులను మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రస్తుత వనరులు, వ్యవసాయ సమస్యలు, సామాజిక ఆర్థిక పరిస్థితులు, నెల స్వభావం, సాగునీటి వనరులు, ఏయే పంటలు సాగుకు అనుకూలమనే అంశాలను పరిశీలించి రైతులకు సూచనలు చేస్తారని ఏఓ రాజవర్ధన్‌రెడ్డి తెలిపారు. పీఆర్‌ఏ కార్యక్రమంపై కేవీకే నిపుణుల బృందం రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డా. భవాని, కె.సురేశ్‌కుమార్, ఏ.అనిత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హాల్‌టికెట్లతో పరీక్షలకు హాజరుకావచ్చని సూచించారు. విద్యార్థులకు సమాచారం అందించే బాధ్యత ప్రిన్సిపాళ్లదేనని.. ఎవరైనా సమాచారం ఇవ్వలేదని ఫిర్యాదు రావద్దని కోరారు.
పారిశుద్ధ్యంపై
దృష్టి సారించాలి
గోపాల్‌పేట: పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని డీపీఓ సురేశ్‌కుమార్ కోరారు. సోమవారం ఏదులలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామాల్లో పన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం, ఇతర అభివృద్ధి పనులపై చర్చించారు. పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో విలీనమైన గ్రామాలపై దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ రాములు, సూపరింటెండెంట్ అరుణవతి, జూనియర్ అసిస్టెంట్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం యాత్రికులకు
24 గంటలు అనుమతి
మన్ననూర్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ చెక్‌పోస్టుల ద్వారా 24 గంటలు వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంతకాలంగా వన్యప్రా ణుల సంరక్షణలో భాగంగా రాత్రి 9 నుంచి ఉద యం 6 గంటల వరకు మన్ననూర్ చెక్ పోస్టు వద్ద రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల చెందిన శివమాలధారులు, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

21న ‘పేట’కు సీఎం రాక
Comments
Please login to add a commentAdd a comment