
సాగునీటికి రోడ్డెక్కిన రైతులు
పాన్‌గల్: సాగునీరందక పంటలు ఎండుముఖం పడుతున్నాయంటూ సోమవారం మండలంలోని అన్నారం, అన్నారంతండా రైతులు వనపర్తి–కొల్లాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు విరమించేది లేదని బైఠాయించడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలకు కాల్వల ద్వారా సాగునీరు అందుతున్నా అన్నారం, అన్నారంతండా గ్రామాలకు మాత్రం సరైన కాల్వలు లేక నీరందక పంటలు ఎండుముఖం పడుతున్నాయన్నారు. సమస్యను పలుమార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమీపంలోని కేఎల్‌ఐ డి–8 ఎంజే–4 ద్వారా మైనర్–4, మైనర్–5 కాల్వల ద్వారా సాగునీరు అందించేందుకు గతంలో సర్వే కొనసాగినా కాల్వల పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రతిసారి సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్రామాల్లోని చెరువులు, కుంటలను నింపితే బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగి ఇబ్బందులు తొలగుతాయని వివరించారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు, పాలకులకు చెప్పినా ఇప్పుడు, అప్పుడంటూ కాలయాపన చేస్తుండటంతో రాస్తారోకో చేయాల్సి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేదిలేదని రైతులు భీష్మించుకొని రోడ్డుపై బైఠాయించారు. ప్రయాణికులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని రాస్తారోకో విరమించండి లేదా ఓ పక్కకు జరిగి వాహనాలు వెళ్లేందుకు సహకరించాలని సీఐ కృష్ణ, ఎస్‌ఐ శ్రీనివాసులు నచ్చచెప్పినా రైతులు రాస్తారోకో విరమించలేదు.
ఇబ్బందులు తొలగిస్తాం..
మండలంలోని అన్నారం, అన్నారంతండాకు సాగునీరు అందించేందుకు కేఎల్‌ఐ డి–8 ఎంజే–4 మైనర్ కాల్వలు తవ్వేందుకు గతంలో సర్వే చేశామని, కొందరు రైతులు అభ్యంతరాలు తెలుపడంతో జాప్యం జరుగుతోందని ఇరిగేషన్ ఈఈ మధుసూదన్‌రావు, డీఈ వెంకటరమణదేవి అన్నారు. మరోమారు సర్వేచేసి వివరాలను జిల్లా అధికారులకు నివేదించి వారి ఆదేశానుసారం సాధ్యమైనంత త్వరగా కాల్వలను తవ్వి రైతులకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. పంటలు ఎండిపోకుండా పది రోజుల్లో సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమీపంలోని కాల్వ ద్వారా సాగునీరు అందించే సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేసి చెరువులు, కుంటలు నింపుతామన్నారు. అధికారుల హామీలో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం అధికారులు సమీపంలోని కేఎల్‌ఐ డి–8 కాల్వను రైతులతో కలిసి పరిశీలించారు.
రెండు గంటలపాటు రాస్తారోకో
అధికారులు, పోలీసుల హామీతో ఆందోళన విరమణ
Comments
Please login to add a commentAdd a comment