
పైరవీకారులను ఆశ్రయించొద్దు
వనపర్తి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే రూ.5 లక్షలు విడతల వారీగా నేరుగా వారి ఖాతాల్లోనే జమవుతాయని.. పైరవీకారులను ఆశ్రయించొద్దని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం సూచించారు. సోమవారం మండలంలోని రాజపేట, అప్పాయిపల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పరిశీలించారు. అక్కడి సమస్యలను నివాసం ఉంటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. కనీస మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరగా సానుకూలంగా స్పందించారు. అప్పాయిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సువర్ణ, వరలక్ష్మి ఇళ్లను సందర్శించి వారి ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు పనులు ప్రారంభించి నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటి నమూనాను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సచిత్ గంగ్వార్, జి.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, హౌసింగ్ అధికారులు విఠోభా, పర్వతాలు, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, ఎంపీడీఓ రాఘవ, తహసీల్దార్ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment