‘సైబర్’ బారిన పడొద్దు
సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహిద్దాం
వనపర్తి: ఛత్రపతి శివాజీ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, డీజే సంస్కృతి మాని సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హిందూవాహిని కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మా ట్లాడారు. ఇతర మతస్తులను గౌరవిస్తూ ఐక్యతను చాటాలని సూచించారు. శోభాయాత్రకు బందోబస్తు కల్పిస్తామని, ట్రా ఫిక్ అంతరాయం తలెత్తకుండా చూస్తామని, ప్రజలు సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. ధ్వని కాలుష్యాన్ని పెంచే డీజేను ఉపయోగించరాదన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, వనపర్తి పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌గౌడ్, కొత్తకోట, ఆత్మకూర్, పెబ్బేరు, శ్రీరంగాపురం హిందూవాహిని మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమరచింత: కొందరు సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయ ఆవరణలో ఉన్న ఫంక్షన్‌హాల్‌లో ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో చేనేత ఉత్పత్తుల సంఘం సభ్యులు, విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిత్య జీవితంలో కష్టపడి పని చేయడంతోనే డబ్బులు వస్తాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సైబర్ నేరగాళ్లు రూ.లక్ష గెలుచుకున్నారు.. బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్ పంపమని సెల్‌ఫోన్లకు సందేశాలు పంపిస్తుంటారని అలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్‌చేసి మాట్లాడితే వారికి సమాధానం చెప్పకుండా మరోమారు కాల్ చేయొద్దని గట్టిగా చెప్పాలన్నారు. అమ్మాయిల ఫోన్లకు ఆశపడి అబ్బాయిలు ఆకర్షణకు లోనైతే న్యూడ్ కాల్స్ పేరిట బెదిరింపులకు పాల్పడటం, అందినంత దోచుకుంటారని.. వారి వేధింపులు భరించలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయని వివరించారు. అమ్మాయిలు సైతం పరిచయం లేని వ్యక్తులు ఫోన్‌చేస్తే కఠిన సమాధానం ఇవ్వాలన్నారు.
చదువుతోనే ఉజ్వల భవిష్యత్..
విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవాలంటే ఉపాధ్యాయులు బోధించే విషయాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవడంతోనే సాధ్యమవుతుందని ఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయులను గౌరవించాలని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో నిత్యం మాట్లాడుతూ రోజువారీ విషయాలు తెలుసుకోవాలని.. అలాగే ఉపాధ్యాయులను కలిసి పిల్లల ప్రవర్తన గురించి ఆరా తీయడం మంచిదని తెలిపారు. దీంతో పిల్లలు చెడు అలవాట్ల బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ నోడల్ ఏజెన్సీ కో–ఆర్డినేటర్ రాజ్‌కుమార్, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ సీఈఓ చిన్నమ్మ థామస్, అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం సీఈఓ శేఖర్, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, చేనేత సహకారం సంఘం డైరెక్టర్ పొబ్బతి వెంకటస్వామి, ఎస్‌ఐ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment