వనపర్తి: డబుల్‌బెడ్రూం ఇళ్లలో చాలా వరకు అసలైన లబ్ధిదారులు నివాసం ఉండటం లేదని.. అలాంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,488 డబుల్‌బెడ్రూం ఇళ్లను నిర్మించగా.. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారితో పాటు 543 నిరుపేద కుటుంబాలకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటీవల డబుల్‌బెడ్రూం ఇళ్లను పరిశీలించగా.. అసలైన లబ్ధిదారులు నివాసం ఉండటం లేదనే విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. అసలు పట్టాదారులు నివాసం ఉండకుండా అద్దెకు ఇవ్వడం.. మరికొన్ని ఖాళీగా పడి ఉన్నట్లు తెలిసిందన్నారు. నిబంధనల ప్రకారం డబుల్‌బెడ్రూం ఇళ్లను అద్దెకు లేదా లీజ్‌కు ఇవ్వడం, అమ్ముకోడానికి వీలు లేదన్నారు. ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని అద్దెకు ఉన్న వారికి ఫారం–2, అసలు పట్టాదారుకు ఫారం–1 ద్వారా నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా 90 శాతానికి పైగా నివాసం ఉంటున్న డబుల్‌బెడ్రూం ఇళ్ల కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజినీరు మల్లయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment