ఇప్పటికే క్షేత్రస్థాయిలో లేఅవుట్ల పరిశీలన పూర్తి
25 శాతం రాయితీతో పెద్దఎత్తున క్రమబద్ధీకరించుకునే అవకాశం
రియల్టర్లకు ఊరట
వనపర్తి: లేఅవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో నాలుగేళ్ల నిరీక్షణకు తెర పడింది. రియల్టర్లలో కొత్త ఆశలు చిగురించినట్లు అయ్యింది. మరోవైపు ఆయా లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ.. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్లియర్ చేస్తామని చెప్పడంతో దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించినట్లయ్యింది. అయితే 2020 ఆగస్టు 28 నాటికి ఏర్పాటుచేసిన లేఅవుట్లకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎల్‌ఆర్‌ఎస్‌కు లైన్ క్లియర్‌తో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. దీనికి తోడు చెల్లించాల్సిన క్రమబద్ధీకరణ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించడం ప్రోత్సాహకంగా ఉందని చెప్పవచ్చు. జిల్లావ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం భారీగా దరఖాస్తులు సమర్పించినా.. కనీసం 10శాతం కూడా క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. ప్రస్తుతం మార్చి 31వ తేదీలోగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి ప్రభుత్వం 25శాతం రాయితీ ప్రకటించడంతో ప్లాట్లు, లేఅవుట్లను పెద్ద సంఖ్యలో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది.
జిల్లాలో 69,239 అర్జీలు..
జిల్లాలోని మున్సిపాలిటీలు, మండలాల్లో లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 69,239 దరఖాస్తులు అందాయి. అందులో ఒక శాతం కూడా పరిష్కారానికి నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీఓలు, మున్సిపల్ ప్రాంతాల్లో కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. అయితే ఆశించిన మేరకు క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫీజు చెల్లించేలా ప్రయత్నాలు మాత్రం జరగలేదు. దీంతో భారీగా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment