నేర రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వనపర్తి: నేర రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తోందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల్లో పోలీసు శాఖపై మరింత నమ్మకం, గౌరవం పెంపొందించేలా పనిచేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. డీఎస్పీలు, సీఐలు తప్పనిసరిగా తమ పరిధిలోని స్టేషన్లను పర్యవేక్షించి.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జిల్లాలో నేర నియంత్రణకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. రోజువారీ పెట్రోలింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, వీలైనంత తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు. నేరస్తులను పట్టుకోవడం, నేర పరిశోధనకు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారితనంతో ఉండాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఫుట్ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు. కొత్త చట్టాలపై సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని, చట్టం పరిధిలోనే పనిచేయాలని తెలిపారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని.. షీ టీం బృందాలను మరింత బలోపేతం చేయాలన్నారు. గంజాయి సరఫరా, వినియోగం మీద ఉక్కుపాదం మోపాలన్నారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులందరూ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐలు రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్‌బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.
పోలీసు శాఖపై
మరింత నమ్మకం పెంచుదాం
ఇసుక అక్రమ రవాణాపై
కఠినంగా వ్యవహరించాలి
ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment