వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర మహిళాశక్తి పథకంలోని 16 రకాల యూనిట్ల గ్రౌండింగ్ వందశాతం పూర్తిచేసి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో మహిళాశక్తి పథకం యూనిట్లు, బ్యాంకు లింకేజీ రుణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇందిర మహిళాశక్తి కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నెలాఖరు వరకు పథకం లక్ష్యాలను చేరుకోవాలని, మహిళా స్వయం సహాయక బృందాలకు పెండింగ్‌లో ఉన్న రూ.30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా గ్రూపు, వ్యక్తిగత యూనిట్లకు సంబంధిత బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేయించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఎం బాషానాయక్, ఏఎల్‌డీఎం సాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment