అన్ని పోలీస్‌స్టేషన్లకు అధునాతన కంప్యూటర్లు
వనపర్తి: మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అధునాతన కంప్యూటర్లు అవసరమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని స్టేషన్ల అధికారులకు కంప్యూటర్లు, ప్రింటర్లు, అధునాతన ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను కాపాడే పోలీసు శాఖలో జిల్లాలోని అన్ని గ్రామాలు, విభాగాల సమాచారం అందుబాటులో ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల పరిధిలోని గ్రామాల వివరాలతో పాటు నేర సంబంధిత విషయాలను భద్ర పరచడానికి, సులభంగా తెలుసుకోవడానికి సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అధునాతన కంప్యూటర్లతో పోలీసు ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారన్నారు.
● పోలీసు ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు ప్రజావాణికి మొత్తం తొమ్మిది ఫిర్యాదులు అందాయని.. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత సీఐ, ఎస్‌ఐలకు సూచించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ, ఇన్‌చార్జి అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐలు కృష్ణ, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ శివకుమార్, సిబ్బంది సుదర్శన్, భరత్ పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు
పాన్‌గల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని.. మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల మహిళా సమాఖ్య భవనంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాన్‌గల్ మండల మహిళా సమాఖ్యకు రూ. 36లక్షల విలువగల ఆర్టీసీ అద్దె బస్సును కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా 150 మండలాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించగా.. అందులో పాన్‌గల్ మండల మహిళా సమాఖ్య ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ ఆదర్శ్ సురభిలకు మహిళా సమాఖ్య తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకటేశ్ యాదవ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ ఎంపీటీసీ హైమావతి పాల్గొన్నారు.
23న సీపీఐ
శతాబ్ధి ఉత్సవాలు
వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించే సీపీఐ శతాబ్ధి ఉత్సవాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో కె.శ్రీరామ్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హాజరవుతారన్నారు. ఉత్సవాలకు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, నాయకులు చంద్రయ్య, భాస్కర్, రమేశ్, రాబర్ట్, మోష, అబ్రహం, నర్సిహయ్య శెట్టి, శ్రీహరి ఉన్నారు.
అన్ని పోలీస్‌స్టేషన్లకు అధునాతన కంప్యూటర్లు
అన్ని పోలీస్‌స్టేషన్లకు అధునాతన కంప్యూటర్లు
Comments
Please login to add a commentAdd a comment