
మహిళలు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి
వనపర్తి: ప్రతి మహిళ తమ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, క్యాన్సర్ వంటి రోగాలు దరి చేరకుండా కాపాడుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నర్సింగాయపల్లిలోని ఎంసీహెచ్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డయాబెటిస్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, విటమిన్ డి–3, విటమిన్ బి–12, థైరాయిడ్ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళా ఉద్యోగులు తప్పనిసరిగా అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రధాన సమస్యగా మారిందని.. ముందుగానే గుర్తించడంతో నియంత్రించవచ్చన్నారు. క్యాన్సర్ మహమ్మారిని స్క్రీనింగ్‌తో ముందుగానే గుర్తిస్తే ప్రాణానికి ముప్పు ఉండదని.. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స చేయించుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చని వివరించారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో నాణ్యమైన వైద్యం అందుతుందని.. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని ఎన్‌ఆర్సీ కేంద్రం ద్వారా 400 మంది సామ్, మామ్ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడినట్లు తెలిపారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌కు అంగన్‌వాడీ టీచర్లు, ఏపీఎంలు, సీసీలు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు, మహిళలు హాజరయ్యారు.
క్రిటికల్ కేర్ యూనిట్ పరిశీలన..
నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ప్రాంగణంలో క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. నెలాఖరు వరకు పనులు పూర్తి చేసేలా వేగం పెంచాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, ఎంసీడీ ప్రోగ్రాం అధికారి రాంచందర్, ఇతర వైద్యాధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment