
203 మంది గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని జాగృతి, విజ్ఞాన్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలు, పెబ్బేరు, శ్రీరంగాపురంలోని పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. మొత్తం 5,802 మంది విద్యార్థులకుగాను 5,599 మంది హాజరుకాగా.. 203 మంది గైర్హాజరైనట్లు వివరించారు.
నాణ్యమైన
విద్యుత్ సరఫరా
వనపర్తి రూరల్/ఖిల్లాఘనపురం: వ్యవసాయ, గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఇన్‌చార్జ్ ప్రత్యేక అధికారి, చీఫ్ ఇంజినీర్ పాండే అధికారులకు సూచించారు. వేసవి ముందస్తు చర్యల్లో భాగంగా వనపర్తి మండలంరాజపేట ఉపకేంద్రం, ఖిల్లాఘనపురం మండలం మానాజీపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కొనసాగుతున్న 5 ఎంవీఏ అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో రాజపేట, అచ్యుతాపురం, నాగవరం తదితర పరిసర గ్రామాలు, తండాల్లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొనసాగుతుందన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎస్‌ఈ రాజశేఖరం,డీఈలు శ్రీనివాసులు, వెంకటశివం, ఆనంద్‌బాబు, ఏఈ కొండయ్య అధికారులు జావీద్ అహ్మద్, చంద్రశేఖర్ ఉన్నారు.
రాయితీ సద్వినియోగం చేసుకోవాలి
ఆత్మకూర్: ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం కల్పించిన రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడిజిల్లా రిజిస్ట్రార్ రవీందర్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్‌వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్థానికులకు ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన కల్పించారు. అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణకు 2020లో రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి ఎల్‌ఆర్‌ఎస్ డబ్బుల చెల్లింపులో 25 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. ఈ అవకాశం నెలాఖరు వరకు ఉందని వినియోగించుకోవాలని కోరారు. సబ్ రిజిస్ట్రార్ ప్రకాశ్, ఆశీర్వాదం, అరుణ పాల్గొన్నారు.
‘కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు’
అమరచింత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని టీయూసీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని మార్స్ భవనంలో జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని.. కార్మిక సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రేవంత్ సర్కార్ 2024, జనవరిలో అడ్డగోలుగా 73 జీఓలను సవరించిందని.. అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల రూ.9,500 వేతనం కూడా పూర్తిస్థాయిలో చెల్లించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కావెంజర్లకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదని, మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు సైతం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్, ప్రసాద్, హన్మంతు, సామెలు, రాజు, చెన్నయ్య, గణేష్ పాల్గొన్నారు.

203 మంది గైర్హాజరు