
ఎల్‌ఆర్‌ఎస్ వసూళ్లలో వేగం పెంచాలి
వనపర్తిటౌన్: పుర పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ వసూళ్లలో వేగం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పుర ప్రత్యేక అధికారి యాదయ్య ఆదేశించారు. శనివారం పుర కార్యాలయంలో పుర కమిషనర్ వెంకటేశ్వర్లుతో సమావేశమై ఎల్‌ఆర్‌ఎస్ వసూళ్లపై ఆరాతీసి మాట్లాడారు. పుర పరిధిలో 28,946 మంది దరఖాస్తుదారులు ఉండగా.. ఇప్పటి వరకు 915 మంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడం రూ.కోటి ఆదాయం సమకూరిందని వివరించారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో ఇళ్లు నిర్మించుకునేందుకు, బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపునకు 25 శాతం రాయితీతో మార్చి 31 వరకు గడువు ఉందని.. పుర అధికారులు సెలవు రోజుల్లోనూ అందుబాటులో ఉంటారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రసార మాధ్యమాలు, ఫ్లెక్సీలు, ఇతర మార్గాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని.. పుర కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెంకటేశ్వర్లు వివరించారు.
త్వరలోనే బుద్దారం
రిజర్వాయర్ బండ్ నిర్మాణం
గోపాల్‌పేట: బుద్దారం రిజర్వాయర్‌లో భాగమైన బండ్ నిర్మాణ పనులు త్వరలోనే చేపడతామని ఆర్డీఓ సుబ్రమణ్యం తెలిపారు. శనివారం ఆయన బుద్దారం రిజర్వాయర్ పరిసరాలను పరిశీలించారు. బండ్ నిర్మాణం చేపట్టే స్థలాన్ని చూసి ఎంతమంది రైతుల భూములకు ఇబ్బంది కలుగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే రైతులతో మాట్లాడారు. బండ్ నిర్మాణం, రిజర్వాయర్‌లో భూములు కోల్పోయే రైతులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని.. అభిప్రాయాలు, నష్టపరిహారం వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం చెరువు పరిధిలో 110 ఎకరాలు ఉండగా.. బఫర్ జోన్‌కు ఇంకా 100 ఎకరాలు అవసరం ఉందన్నారు. బాధిత రైతులకు ప్రభుత్వం నుంచి వీలైనంత ఎక్కువ పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామని వివరించారు. అనంతరం బుద్దారం గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఇరిగేషన్, ఎస్‌డీసీఎఫ్, రెవెన్యూ అధికారులు తిలక్‌కుమార్‌రెడ్డి, యాదయ్య, రైతులు ఉన్నారు.
క్షయ నిర్ధారణలో
రాష్ట్రస్థాయిలో ప్రథమం
వనపర్తి: వందరోజుల క్షయ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో జిల్లాకు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం లభించిందని.. కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచనలు, సహకారంతో అరుదైన ఘనత సాధించామని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో పురస్కారం అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రారంభించిన వందరోజుల క్యాంపెయిన్‌లో అధికారులు, సిబ్బంది ఉత్తమ పనితీరు కనబర్చడంతో రాష్ట్రస్థాయిలో పురస్కారం దక్కిందన్నారు. జిల్లాలో 1.70 లక్షల మందికి క్షయ పరీక్షలు నిర్వహించి 436 మందికి వ్యాధి ఉన్నట్లు గుర్తించామన్నారు. వారందరికి 100 శాతం చికిత్స అందించడమే కాకుండా నాట్కో సంస్థ సహకారంతో పోషకాహార కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. వ్యాధి నిర్ధారణకు స్క్రీనింగ్ ఎక్స్‌రే యంత్రం కొనుగోలుకు కలెక్టర్ రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
శనేశ్వరుడికి
శాస్త్రోక్తంగా పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడికి ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలినాటి శనిదోష నివారణ కోసం భక్తులు శనివారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని తిలతైలాభిషేకాలతో తమ గోత్రనామార్చనలతో పూజలు జరిపించారు.

ఎల్‌ఆర్‌ఎస్ వసూళ్లలో వేగం పెంచాలి

ఎల్‌ఆర్‌ఎస్ వసూళ్లలో వేగం పెంచాలి