
మహిళా సంఘాల అభివృద్ధికి కృషి
వనపర్తి: ప్రతి మండలంలో మహిళా సంఘాలతో స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేయించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, ఏపీఎంలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల స్వయం ఉపాధి, సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తూ మహిళా సంఘాలకు చేయూతనిస్తున్నాయని, సద్వినియోగం చేసుకొనేలా మహిళా సంఘాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. పెట్రోల్‌బంక్, గోదాం, రైస్‌మిల్లు మరేదైనా వ్యాపారం ప్రారంభించేలా అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలు యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొస్తే జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైతే శిక్షణ సైతం ఇప్పిస్తామని చెప్పారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అత్యధికంగా ఐకేపీ వారికి కేటాయిస్తామని, కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా ఉండేందుకు ఏఈఓల ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని.. కేంద్రాల ఇన్‌చార్జ్‌లు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ఈసారి మంచి నాణ్యమైన గన్నీ బ్యాగులు అందజేస్తామన్నారు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారు చనిపోతే వారి జీవిత భాగస్వామికి పింఛన్ మంజూరు చేయడంలో అలసత్వం వద్దని ఆదేశించారు. జిల్లాలో 451 పెండింగ్‌లో ఉన్నాయని.. గ్రామాల వారీగా వివరాలు సేకరించి మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, భాగస్వామి బ్యాంకు ఖాతా వివరాలు ఎంపీడీఓ కార్యాలయంలో అందిస్తే ఏప్రిల్ 10 లోగా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించేందుకు మహిళా సంఘాలకు ఆర్డరు ఇవ్వడం జరిగిందని.. ఏ పాఠశాల విద్యార్థులకు ఎవరు దుస్తులు కుట్టాలో మ్యాచింగ్ బ్యాచింగ్ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి కొలతలు తీసుకొని సరిపోయిన విధంగా కుట్టేలా చూడాలన్నారు. జూన్ 2లోగా కనీసం ఒక జత యూనిఫాం సిద్ధమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీపీఎం అరుణ, ఏపీఎంలు పాల్గొన్నారు.