
నిఘాతోనే నేరాల నియంత్రణ
వనపర్తి: గ్రామ పోలీసు అధికారులు గ్రామాల్లో పూర్తిస్థాయిలో నిఘా ఉంచి నేరాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ముందస్తుగా తెలుసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొని వివిధ అంశాలపై పలు సూచనలు చేశారు. డీఎస్పీ, సీఐలు తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్లను సందర్శించి సిబ్బంది పనితీరు సమీక్షించాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. పెట్రోలింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, వీలైనంత త్వరగా బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ యువత సైతం గంజాయి తీసుకునే స్థాయికి విక్రయాలు పెరిగాయని.. సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసి అడ్డుకట్ట వేయాలని, గ్రామాల్లోని యువతకు అవగాహన కల్పించాలని కోరారు. రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాలని, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రైటర్స్, సీసీటీఎన్‌ఎస్, రిసెప్షన్, సీడీఓఎస్‌కు వర్టికల్ వారీగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు. పట్టణాల్లో సైక్లింగ్ చేస్తూ గస్తీ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై హాట్‌స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో తగిన మార్పులు చేపట్టాలని, ప్రతి రోడ్డు ప్రమాదాన్ని ఎస్‌హెచ్‌ఓ స్వయంగా సమీక్షించాలన్నారు. వాహన తనిఖీలతో పాటు జాతీయ రహదారి కూడళ్లు, గ్రామాలు, పుర వార్డుల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, మహిళలపై దాడులు, వేధింపులపై అలసత్వం వద్దని, అలాంటి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు. బెట్టింగ్ వైపు యువత వెళ్లవద్దని.. బెట్టింగ్‌లు ఆడినా, ఆడించినా కఠినంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు, శిక్షణ ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పెట్రోలింగ్ సమర్థవంతంగా నిర్వహించాలి
ఎస్పీ రావుల గిరిధర్