
రైతులకు ఆధార్ మాదిరిగా భూదార్ కార్డులు
ఖిల్లాఘనపురం/ కొత్తకోట రూరల్: ఇక నుంచి రైతులకు ఆధార్ మాదిరిగా భూదార్ కార్డులు ప్రభుత్వం అందజేస్తుందని, భూ భారతిలో సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై గురువారం ఖిల్లాఘనపురం, పెద్దమందడి రైతువేదికల్లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా తహసీల్దార్ చేసే మ్యుటేషన్లు, జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ, కలెక్టర్‌కు అప్పీలు చేసుకునే అవకాశం ఉందన్నారు. గతంలో ఈ వ్యవస్థ లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కానీ, భూ భారతితో అన్ని సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటుగా కాకుండా అందరి సూచనలు, సలహాలు తీసుకుని ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా రికార్డుల్లో ఏమైనా తప్పులు, సవరణలు ఉంటే సరిదిద్దే అవకాశం ఉందన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయడంతో రెవెన్యూ అధికారులది కీలక పాత్ర అని, వారికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్లు సుగుణ, సరస్వతి, పీఏసీఎస్ చైర్మన్ మురళీధర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
30 నాటికి ఎల్‌ఆర్‌ఎస్ గడువు
వనపర్తి: ఈ నెల 30 నాటికి ఎల్‌ఆర్‌ఎస్ గడువు ముగుస్తున్నందున కచ్చా లే అవుట్, ప్లాట్‌లు రెగ్యులరైజ్ చేయించుకునే విధంగా మున్సిపల్ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. హైదరాబాద్ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఎల్‌ఆర్‌ఎస్ పురోగతిపై కలెక్టర్లతో వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో 48,423 దరఖాస్తులకు గాను 38,726 మందికి ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు 7,405 మంది తమ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రూ.9.28 కోట్లు చెల్లించారని, ఇందులో 3,602 ప్లాట్లను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. శనివారం మరోసారి సమావేశం నిర్వహించి గడువులోగా అత్యధికంగా ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.