
45 రోజుల్లోనే ఫిర్యాదులకు పరిష్కారం
వనపర్తి టౌన్: విద్యుత్ వినియోగదారుల ఫోరం పరిధిలోకి వచ్చే సమస్యలను వినియోగదారులు ఫోరానికి ఎలా ఫిర్యాదు చేసినా 45 రోజుల్లోనే పరిష్కరిస్తామని ఫోరం చైర్మన్ నాగేశ్వరరావు, ఫైనాన్స్ మెంబర్ రామానుజ నాయక్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీఈ కార్యాలయం ఎదుట సీజీఆర్‌ఎఫ్ (కన్జ్యూమర్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ ఫోరం) ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాట్సప్, ఆన్‌లైన్ లేదా కార్యాలయానికి ప్రత్యక్షంగా వచ్చి, పోస్టు కార్డు ద్వారా ఫిర్యాదు చేసిన విద్యుత్ సమస్య పరిష్కారానికి ఫోరం కృషిచేస్తుందన్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు, కొత్త కనెక్షన్ జారీలో ఆలస్యం, మీటర్, సర్వీస్ లోపాలు, రీ కనెక్షన్ సమస్యలు, కాలిపోయిన మీటర్, కనెక్షన్ మార్పిడి, బిల్లులో తప్పులు తదితర సమస్యలపై ఫోరం వినియోగదారులకు పరిష్కారం చూపుతుందన్నారు. గతేడాది ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల పరిధిలో విద్యుత్ ఫోరం 700 సమస్యలను పరిష్కరించిందని చెప్పారు. అలాగే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రైతుల సమస్యలను సైతం ఫోరం పరిష్కరిస్తుందన్నారు. విద్యుత్ ఫోరం సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఫోరానికి 51 మంది ఫిర్యాదులు అందజేశారు. సమావేశంలో ఎస్‌ఈ రాజశేఖరం, డీఈ శ్రీనివాస్, అధికారులు వెంకటశివరాం, వెంకటరమణ పాల్గొన్నారు.
● ఇదిలా ఉండగా.. విద్యుత్ వినియోగదారుల ఫోరానికి స్పందన కరువైంది. క్షేత్రస్థాయిలో సమావేశంపై ప్రచారం చేయకపోవడంతో ఎవరూ రాలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే వినియోగదారులకు కేటాయించిన సీట్లలో డీఈ, ఎస్‌ఈ, రెవెన్యూ కార్యాలయంలో, వివిధ మండలాలకు చెందిన ఏఈలు, ఏడీలు వినియోగదారుల మాదిరిగా అవగాహన సదస్సులో కూర్చోవడం గమనార్హం.