
కనులపండువగా పంబ ఆరట్టు
వనపర్తిటౌన్: అయ్యప్ప జన్మదినం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో పంబ ఆరట్టు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించి పంబ ఆరట్టులో భాగంగా పవిత్ర జలాలతో చక్రస్నానం చేయించారు. భక్తుల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. చక్రస్నానం అనంతరం మేళతాళాలు, వాయిద్యాలతో స్వామివారిని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చి పల్లకీసేవ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమై లక్ష్మీ గణపతి హోమం, మూల విగ్రహానికి ఆలయ ప్రధాన అర్చకుడు రమేష్‌శర్మ అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తికి 3 గంటల పాటు అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ఆలయంలోని మూలమూర్తికి సహస్ర నామార్చన, మహా మంగళహారతి, భక్తులకు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆధ్యాత్మికతే శరణ్యం..
ఆత్మశుద్ధికి ఆధ్యాత్మికతే శరణ్యమని బిజ్వారం అంబత్రేయ క్షేత్ర పీఠాధిపతి డా. ఆదిత్య పరాశ్రీ అన్నారు. శుక్రవారం రాత్రి ఆలయంలోని ఏకాశిల పడికి పూజ నిర్వహించి సందేశమిచ్చారు. సనాతన ధర్మం ఎంతో గొప్పదని.. అందులోని ప్రతి అంశం లోక కళ్యాణం, సర్వమానవాళి శ్రేయస్సే లక్ష్యమని తెలుసుకోవాలన్నారు. భక్తిభావంతో పాటు ధర్మమార్గాన్ని అనుసరించాలని సూచించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో భక్తిభావం పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు.
108 ఇటుకలకు పూజలు..
కొత్తకోట రూరల్: మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో గోపాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజ్వారం అంబత్రేయ క్షేత్ర పీఠాధిపతి డా. ఆదిత్య పరాశ్రీ హాజరయ్యారు. హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్ర నిర్మాణంలో సమస్త భక్తులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 108 ఇటుకలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఇటుకలను ఆదిత్య పరశ్రీ గురూజీ భక్తులకు అందజేశారు. ఆ ఇటుకలకు ఇంట్లో11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం అందజేయాలని ఆలయ నిర్వాహకులు సూచించారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు దూపం నాగరాజు, పొగాకు అనిల్‌కుమార్, విశ్వనాథం గంగాధర్‌శెట్టి, భీమకిషోర్‌కుమార్, బలిజ లింగేశ్వర్, వేముల సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఏకశిల పడిపూజ
నిర్వహిస్తున్న అర్చకులు