
భక్తుల ఇలవేల్పు చింతల మునిరంగడు
అమరచింత: శ్రీమహావిష్ణువుగా కొలువుదీరి భక్తుల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న చింతల మునిరంగస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మండలంలోని పాత ఈర్లదిన్నెలో వెలసిన శ్రీచింతల మునిరంగస్వామి బ్రహ్మోత్సవాలు పౌర్ణమి రోజు నుంచి మూడురోజులపాటు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఇక్కడి స్వామివారికి భక్తులు పొట్టేళ్లు, కోళ్లు బలి ఇచ్చి నైవేద్యం సమర్పించిన తర్వాత.. మళ్లీ తీపి వంటలతో నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అయితే చింతల మునిరంగస్వామి జాతర ఉత్సవాలు ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారి పల్లకీసేవ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సోమవారం ప్రభోత్సవం, మంగళవారం జంతుబలితోపాటు నైవేద్యాల సమర్పణ ఉంటుంది. జాతరకు జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.
స్వామివారికి మాంసం.. తీపి వంటలతో నైవేద్యాలు
నేటినుంచి మూడురోజులపాటు బ్రహ్మోత్సవాలు