
బడుల బలోపేతానికి తోడ్పాటునివ్వాలి
పాన్‌గల్: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల చైర్మన్లు తోడ్పాటునందించాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల చైర్మన్ల మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చైర్మన్లు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సహకరించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కృత్రిమ మేధా ఆధారిత విద్యబోధన ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని కమిటీ చైర్మన్లు వివరించగా.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థులు శ్రీమాన్, నయనతార ఆంగ్లంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను వివరించడంతో పాటు ఆంగ్లంలో మాట్లాడిన తీరును అభినందిస్తూ ఒక్కో విద్యార్థికి రూ.100 నగదు అందించారు. పాఠశాల కమిటీల చైర్మన్లతో సమావేశం నిర్వహించడం జిల్లాలోనే ప్రథమం అని ఎంఈఓ శ్రీనివాసులను డీఈఓ అభినందించారు. ఏఎంఓ మహానంది, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, కృష్ణమూర్తి, ఎంఈఓ శ్రీనివాసులు, ఏపీఎం వెంకటేష్‌యాదవ్, పీఎస్ హెచ్‌ఎం పద్మ, చైర్మన్లు, సీఆర్పీలు పాల్గొన్నారు.