నాన్నే నా ధైర్యం | - | Sakshi
Sakshi News home page

నాన్నే నా ధైర్యం

Published Sun, Jun 16 2024 1:22 AM | Last Updated on Sun, Jun 16 2024 2:32 PM

-

ముగ్గురు ఆడపిల్లలే అని ఎన్నడూ బాధపడలేదు

మహాలక్ష్మీలు పుట్టారని సంతోషించేవారు

నా ఇష్టాలను ఎప్పుడూ కాదనలేదు

2016లో రాజకీయాల్లోకి వస్తానంటే సమయం ఉందన్నారు

ఎనిమిదేళ్ల తర్వాత తీసుకొచ్చారు.. నిలిచి గెలిచారు..

ఎన్నికల సమరంలో ప్రతీక్షణం నా వెనుకాలే ఉన్నారు

‘సాక్షి’తో వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య

‘సాధించాలన్న పట్టుదల, ఆశయ సాధన కోసం శ్రమించే తీరు.. ఇవన్నీ నాన్న నాకు ఇచ్చిన ఆస్తులు. ముక్కుసూటిగా మాట్లాడే నాన్నంటే ఇప్పటికీ ఎంతో ఇష్టం. ఆయనే నా ధైర్యం.. నాన్న పక్కన ఉంటే కొండంత అండ ఉంటుందనిపిస్తుంది’ అని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య అంటున్నారు. కూతురిని తన వారసురాలిగా రాజకీయాల్లోకి తీసుకురావాలని, తనలా ప్రజాప్రతినిధి చేయాలన్న తండ్రి కల నెరవేరింది. మొదటినుంచి తన వెన్నెముకగా నిలిచి కూతురిని రాజకీయ అరంగ్రేటం చేయించి పక్కా ప్రణాళికతో విజయం సాధించారు. తండ్రి ఆశయం మేరకు కూతురు కావ్య ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి వరంగల్‌ రెండో మహిళా పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికై చట్టసభల్లో అడుగుపెట్టారు. నేడు (ఆదివారం) ఫాదర్స్‌ డేని పురస్కరించుకుని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఆమె తండ్రి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో ఉన్న ఆప్యాయత, అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే..   

 హన్మకొండ చౌరస్తా:  మేము నాన్నకు ముగ్గురు కావ్య, దివ్య, రమ్య కూతుళ్లం. నాన్న హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించేవారు. సరిగ్గా నేను ఏడో తరగతి చదువుతున్న సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చారు. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినప్పటికీ  నాన్న మా ముగ్గురిని చాలా గారాబంగా పెంచి, చదివించారు. ముగ్గురు ఆడపిల్లలు అన్న సామాజిక అంశం అక్కడక్కడ ప్రస్తావన వచ్చేది. అప్పుడు మానాన్న ఒక్కటే చెప్పేవారు నాకు ముగ్గురు మహాలక్ష్మీలు పుట్టారని చాలా సంతోషించేవాడు.

 నాన్న రాజకీయాల్లోకి వచ్చాక మాతో గడిపేందుకు ఎక్కువ సమయం ఉండేది కాదు. కానీ మా అవసరాలను ఎన్నడూ కాదనలేదు. ఎంత రాత్రి అయిన, ఉదయమైనా మా ముఖ కవళికలను బట్టే మాకు ఏం కావాలో తెలుసుకుని ఇచ్చేవారు. పదవ తరగతి పూర్తయ్యాక, ఇంటర్‌ ఆ తర్వాత హైదరాబాద్‌లోని డెక్కన్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాను. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ తర్వాత నాన్నతో అన్నీ విషయాలను పంచుకునేదాన్ని. జీవితంలో ఏ స్టెప్‌ తీసుకోవాలన్న నాన్నతో చర్చించి, నిర్ణయం తీసుకోవడమే. ఎంబీబీఎస్‌ చదువుతున్నప్పుడే నా భర్త(నజీర్‌) పరిచయం అయ్యాడు. ఇద్దరం ఇష్టపడ్డాం. ఈ విషయాన్ని నాన్నకు చెప్పా. రెండు రోజులు ఆలోచించి నీ సంతోషమే నాకు ముఖ్యమంటూ మా పెళ్లికి అంగీకరించారు. పెళ్లి.. ఆ తర్వాత జాబ్‌ రీత్యా ఇద్దరం ఇక్కడే స్థిరపడిపోయాం. మాకు ఇద్దరు ఆడపిల్లలు దియా, మెహిరా.

సమయం వచ్చినప్పుడు చెబుతా అన్నారు..
ప్రజాప్రతినిధి హోదా ఉంటే ప్రజలకు, సామాజిక సేవ మరింత ఎక్కువ చేయొచ్చని అనిపించింది. ఈ విషయాన్ని 2016లో నాన్న డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు నాన్న రాజకీయాలంటే అంత సులువు కాదు.. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా అని సర్దిచెప్పారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇందులో సమయ స్ఫూర్తి, ఓర్పు ఉండాలని పదే పదే చెబుతుంటారు.

మానసిక ధైర్యం నూరిపోశారు..
నా జీవితంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికలు మరిచిపోలేని తీపి గురుతులు. కడియం శ్రీహరి కూతురిగా రాజకీయాల్లోకి వచ్చిన నాపై ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు కొంత బాధగా అనిపించాయి. అప్పుడు నాన్న ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయని పట్టించుకోవద్దని మానసిక ధైర్యం నూరిపోశారు. ఆత్మస్థైర్యంతో రాజకీయ ప్రచారంలో పాల్గొన్నా. ఎంపీగా నా విజయం కోసం నాన్న ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను.

ప్రతీక్షణం నా వెనుకాలే..
రాజకీయ అరంగేట్రం చేస్తున్న సమయంలో నాన్న ప్రతీక్షణం నా వెనుకాలే ఉన్నారు. ఎంపీ టికెట్‌ వచ్చిన మొదలు గెలిచే వరకు ఒకటీరెండు మీటింగులు తప్పితే అత్యధిక సమావేశాలు, సభలకు నాన్న నా వెంటే ఉంటూ నా వెన్నెముకలా నిలిచారు. సభల్లో ఎలా మాట్లాడాలి.. ఏయే అంశాలు ప్రస్తావించాలి.. మొదలు ప్రతిదీ చిన్నపిల్లలకు మాదిరిగా చెప్పేవారు. మడికొండలో సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రసంగించే సమయంలో నాన్న ఉన్నాడన్న ధైర్యమే నన్ను నిలబెట్టింది.  

డాక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆ కేసులతోనే.. 
డాక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే ఎక్కువ శాతం మహిళలు గర్భసంచి సమస్యతో బాధపడేవారు వచ్చేవారు. ఎందుకీ సమస్య అంటూ ఆరా తీయగా కౌమారదశలో వచ్చే పీరియడ్స్‌కు సరైన ప్యాడ్లు వినియోగించకపోవడమని తెలిసింది. ఆ సమస్యకు పరిష్కారం కోసం వెంటనే కడియం ఫౌండేషన్‌ ద్వారా బాలికలకు ప్యాడ్లు పంపిణీ చేయడం ప్రారంభించా. సంవత్సరంలో పదివేల మందికి ప్యాడ్లు పంచా. నాన్న విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 6.5లక్షల మంది బాలికలకు పంపిణీ చేసినట్లు తెలిసింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement