నలుగురు మోటార్ల దొంగల అరెస్ట్
ఖానాపురం: విద్యుత్ మోటార్ల చోరీకి పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ తెలిపారు. ఈ మేరకు ఖానాపురం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై ఛాగర్ల రఘుపతితో కలిసి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చోరీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అశోక్‌నగర్–పర్శనాయక్‌తండా మధ్య పంటపొలాల్లోని రైతుల మోటార్లు ఇటీవల చోరీకి గురయ్యాయి. దీంతో రైతుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఎస్సై రఘుపతి అనుమానితుల వివరాలు సేకరించి అశోక్‌నగర్ శివారులో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. నర్సంపేట మండలంలోని కొండసముద్రంతండాకు చెందిన ధరావత్ రాంసింగ్, ధరావత్ మల్లు ద్విచక్ర వాహనంపై, జన్ను ముఖేశ్, హనుమకొండలోని చింతగట్టు క్యాంపు ఏరియాకు చెందిన ఆకారపు నవీన్ నడుచుకుంటూ వస్తున్నారు. తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని పరిశీలించగా కట్టర్, హాక్‌సాబ్లేడ్ లభించాయి. నడుచుకుంటూ వస్తున్న వారిని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, ఇటీవల విద్యుత్ మోటార్ల దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. చోరీ చేసిన మోటార్లను ద్విచక్ర వాహనంపై చిలుకమ్మతండాలోని రాంసింగ్ బంధువు అయిన విజేందర్ ఇంటి వద్ద దాచినట్లు చెప్పారు. అక్కడకు వెళ్లి రూ.1.25 లక్షల విలువ చేసే 9 మోటార్లతో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. చోరీలను ఛేదించిన సిబ్బందిని సీఐ అభినందించారు. సిబ్బంది సంతోష్, సుమన్, వీరస్వామి, లింగ మూర్తి, ప్రవీణ్, హోంగార్డు ఎర్రయ్య పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ వివరాల వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment