బోగస్ మాటలు కట్టిపెట్టండి
వరంగల్: అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ, బోగస్ మాటలు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా ఆ మాటలు కట్టిపెట్టి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను నర్సంపేట, భూపాలపల్లి, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్వేలు సుదర్శన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, నరేందర్‌తో కలసి సందర్శించారు. మిర్చి రైతులతో మాట్లాడి కొనుగోళ్లు, ధర తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రేవంత్‌రెడ్డి... ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకో, అబద్ధాలు మాట్లాడడం మానుకో రైతు బంధు ఇవ్వలేదు. రుణమాఫీ 50 శాతం పూర్తి కాలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే మిర్చి క్వింటాకు రూ.15 వేలకు తగ్గకుండా చూస్తామన్న హామీ ఎక్కడికి పోయింది’ అని అన్నారు.రూ. 25వేలు పెట్టి కొనుగోలు చేసేంత వరకు రైతుల పక్షాన అందోళలు చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, నరేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏప్రాంతంలో ఎలాంటి పంటలు వేస్తారు, ఏ మేర కు సాగు చేస్తారన్న విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతలకు తెలియకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మంత్రులు సురేఖ, సీతక్క, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కనాడు రైతుల గురించి, ఏనుమాముల మార్కెట్‌లో జరుగుతున్న వ్యవహరంపై మాట్లాడలేదన్నారు. కుంభకోణాలతో పాటు ధాన్యం, సీసీఐ కొనుగోళ్లలో మీ పాత్ర స్పష్టంగా ఉంటోందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, చింతం సదానందం, టి.రమేశ్‌బాబు, వాసుదేవరావు, కేతిరి రాజశేఖర్, సుభాష్, చిలువేరు పవన్ తదితరులు పాల్గొన్నారు.
మిర్చి రైతులకు న్యాయం చేయాలి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment