తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు
ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి
● వివరాలు సేకరించిన క్లూస్‌టీం
● నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఐనవోలు: మద్యానికి బానిసై వేధిస్తున్నాడని ఆవేశంతో తండ్రిని కొడుకు కత్తితో పొడిచిన ఘటన పున్నేలులో జరిగింది. పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. పున్నేలుకు చెందిన మామునూరి భాస్కర్ (50) ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. భాస్కర్ ఇద్దరు కుమారులు కూడా ఆటో నడుపుతున్నారు. పెద్ద కుమారుడు అన్వేష్‌కు వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు అరుణ్‌కు వివాహం కాలేదు. భాస్కర్ మద్యం సేవించి భార్య జయమ్మ, కుమారులతో గొడవపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్య జయమ్మను తిడుతుండగా చిన్న కుమారుడు అరుణ్ ఆపడానికి ప్రయత్నించాడు. నాకే అడ్డు వస్తావా, నీ సంగతి చూస్తా అంటూ కుమారుడిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో అరుణ్ ఆవేశంలో ఇంట్లో ఉన్న కత్తితో (ఫోల్డెడ్ నైఫ్) భాస్కర్ ఛాతిలో ఎడమవైపు బలంగా పొడిచాడు. కిందపడిపోయిన భాస్కర్‌ను పెద్ద కుమారుడు అన్వేష్, భార్య జయమ్మ ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలో అంబులెన్స్‌లోకి ఎక్కించి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా భాస్కర్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుమారుడు అన్వేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment