ఉపాధి హామీ పనులు పూర్తి చేయండి
కలెక్టర్ ప్రావీణ్య
వేలేరు: గడువులోగా ఉపాధి హామీ పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. మండలంలోని పీచర, మల్లికుదుర్ల గ్రామాలను మంగళవారం ఆమె సందర్శించారు. పీచరలో రూ.2.80 లక్షలతో నిర్మిస్తున్న ఫారంపాండ్, రూ.84 వేలతో నిర్మిస్తున్న పాడి పశువుల షెడ్డును పరిశీలించారు. ఎంతమంది కూలీలు పనులకు హాజరయ్యారని కలెక్టర్ అడుగగా.. 79 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. మల్లికుదుర్లలో రూ.2.60 లక్షలతో సాగుచేసిన ఎకరం విస్తీర్ణంలోని మామిడి తోట, రూ.20 లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనల మేరకు కూలీలకు పనులు కల్పించాలని, పనిప్రదేశాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్, షెడ్‌నెట్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతుల కల్పనకు చర్యలు
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. పీచరలోని మూడు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంఖ్య అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. మోను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారి మల్లయ్య, తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment