
సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయండి
ఎల్కతుర్తి: వరంగల్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలకు సరిహద్దు ప్రాంతమైన ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరుగుతున్న జంక్షన్ సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనుల పురోగతి గురించి ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు, ఇతర శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. జంక్షన్ నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జంక్షన్ నిర్మాణం, సుందరీకరణ పనులు 80 శాతం పూర్తయినట్లు తెలిపారు. మిగతా పనులు పది రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఫౌంటెన్ నిర్మాణం, గ్రీనరీ ఏర్పాటు, శిల్పాలు, విద్యుత్ లైట్లు, సైన్ బోర్డులు, జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. బస్టాండ్ ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను కలెక్టర్ పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటు బాగుందని, విజయవంతగా క్యాంటీన్ నిర్వహించాలని సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమేశ్ రాథోడ్, ఆర్టీసీ డీఎం ధరమ్‌సింగ్, ఎంపీడీఓ విజయ్‌కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య
ఎల్కతుర్తి జంక్షన్ పనుల పరిశీలన