
చిక్కుల్లో చేప
ఎదుగూ బొదుగు లేని మీనం..!
● టెండర్లు, చేప పిల్లల పంపిణీలో ఆలస్యం
● సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లు
● నాసిరకం, ఇష్టారాజ్యంగా సరఫరా
● 750 గ్రాముల బరువు దాటని చేపలు
● ఎండదెబ్బ.. దిగుబడిపై సన్నగిల్లిన ఆశలు
● నష్టపోతున్నామంటున్న మత్స్యకారులు
సాక్షిప్రతినిధి, వరంగల్ :
మత్స్యకారుల జీవనోపాధికి ప్రభుత్వం వంద శాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. 2024–25 సంవత్సరానికి గాను ఉమ్మడి వరంగల్ పరిధి 3,861 నీటి వనరుల్లో ఈ ఏడాది 14.07 కోట్ల చేప పిల్లలు వదలాలి. 2024 జనవరిలోనే 35–40, 80–100 మిల్లీమీటర్ల పరిమాణమున్న చేప పిల్లల సరఫరాకు టెండర్లు పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణానికి తగినట్టుగా మెరిగలు, బొచ్చ, రవ్వు, కట్ల, బంగారు తీగ లాంటి చేప పిల్ల లను ఉత్పత్తి చేసి సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఏటా టెండర్లు దక్కించుకుంటున్న గుత్తేదారు సంస్థలు స్థానికంగా పెంచకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినవి చెరువుల్లో వదిలి చేతులు దులుపుకుంటున్నారు. జూన్‌లో పంపిణీ చేయాల్సిన చేప పిల్లలను ఆగస్టులో మొదలెట్టి అక్టోబర్ వరకు పంపిణీ చేశారు. ఈలోగా కొన్ని మత్స్య సహకార సంఘాల నాయకులు, సభ్యులు డబ్బులు పోగేసుకుని చేప పిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. చాలాచోట్ల గుత్తేదార్లు సరఫరా చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉండగా.. వాటిలో ఇప్పటికీ ఎదుగుదల లేదని మత్స్యకారులు అంటున్నారు.
చేప పిల్లల పంపిణీ 63.11 శాతమే
ఉమ్మడి వరంగల్‌లో 3,861 చెరువులు, కుంటలు ఉండగా.. 14.07 కోట్ల చేప పిల్లలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మత్స్యశాఖ ప్రకటించింది. అయితే.. 35–40 మిల్లీమీటర్ల పిల్లలు 4.89 కోట్లు, 80–100 మిల్లీమీటర్లవి 3.99 కోట్లు.. మొత్తం 8.88(63.11 శాతం) కోట్లు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి జూన్ మొదటి వారం నుంచే చేప పిల్లలు చెరువుల్లో పోయాల్సి ఉంది. అలాగైతే ఆరేడు నెలల గడువులో ఒక్కో నెలకు పావుకిలో పెరిగినా రెండు, రెండున్నర కిలోలకు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఓ వైపు నాసిరకం విత్తన చేపపిల్లలు, మరోవైపు ఆలస్యంగా చెరువుల్లో వదలడం.. ఎండిపోతున్న చెరువుల్లో తీవ్రమైన ఎండవేడి.. ఈ ప్రతికూల కారణాలతో చెరువులో చేప ఎదగడం లేదు. మార్చి చివరి నుంచి చేపలు పట్టే అవకాశం ఉన్నా 450–750 గ్రాముల సైజులోనే ఉండటంతో మిన్నకుండిపోయారు. కాంట్రాక్టర్లు, దళారులతో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేయకుండా వాటికయ్యే మొత్తాన్ని నేరుగా మత్స్య పారిశ్రామిక సంఘాల అకౌంట్లలోకి జమ చేస్తే.. నచ్చిన చేప పిల్లలను కొనుగోలు చేసి సకాలంలో చెరువుల్లో పోస్తే మంచి ఫలితాలు వస్తాయని మత్స్యకారులు అంటున్నారు.

చిక్కుల్లో చేప