సాక్షి, భీమవరం/భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ లో భాగంగా జిల్లాలను విభజించారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిని భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటుచేశారు. గతేడాది ఏప్రిల్ 4న కొత్త జిల్లా కేంద్రం నుంచి పాలన ప్రారంభం కాగా ఇప్పుడు ఏడాది పూర్తి చేసుకుంది.
ప్రజలకు పాలనను చేరువ చేయడం, అభివృద్ధి పరుగులు పెట్టించడం, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ధ్యేయంగా కొత్త జిల్లాలో పాలన సాగుతోంది. పాలకొల్లు నియోజకవర్గం భగ్గేశ్వరంలో 64 ఎకరాల్లో రూ.475 కోట్లతో వైద్య కళాశాల, భీమవరంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
భీమవరంలోని కలెక్టరేట్ జిల్లాలోని అన్నిప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండటంతో వ్యయప్ర యాసలు తప్పాయి. జిల్లాలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ఏడాది కాలంలో 15,423 దరఖాస్తులు రాగా 14,574 అర్జీలను పరిష్కరించారు.
పాలనపై ప్రత్యేక మార్క్
నూతన పశ్చిమగోదావరి జిల్లాకు మొదటి కలెక్టర్‌గా పి.ప్రశాంతి పనిచేస్తున్నారు. ఆమె పాలనలో తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను సకాలంలో అందించడంతో పాటు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.
వరదల సమయంలో..
గతేడాది గోదావరికి వరదలు వచ్చిన సమయంలో లంక గ్రామాలు నీటమునగాయి. కలెక్టర్ ప్రశాంతి అధికార యంత్రాంగంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నెల రోజులపాటు జిల్లా యంత్రాంగం సమర్థంగా సేవలందించడంతో ఏ ఒక్క ప్రాణానికి హాని కలగలేదు.
స్వగృహ‘మస్తు’
జిల్లాలో పేదలకు ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటివరకూ 20 వేల మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకున్నారు. మరిన్ని ఇళ్లు నిర్మాణ దశల్లో ఉన్నాయి. లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు
భీమవరంలోని రాయలంలో రూ.1.60 కోట్లతో బ్లడ్ బ్యాంకును ఏర్పాటుచేశారు. కలెక్టర్ ప్రోత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగులు, దాతలు రూ.50 లక్షల విరాళం అందించారు. త్వరలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించనున్నారు.
భీమవరం.. సుందర పట్టణం
భీమవరం సుందర పట్టణంగా రూపుదిద్దుకుంటోంది. వెల్‌కమ్ ఆర్చిలు, వాటర్ ఫౌంటెన్లు, వాల్ పెయింటింగ్స్, డివైడర్ల మధ్యలో మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. వ్యాపారవేత్తలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పట్టణ సుందరీకరణకు కలెక్టర్ కృషిచేస్తున్నారు.
‘రియల్’కు మంచి రోజులు
భీమవరం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. భీమవరంలో కొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులో ఉండటంలో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అలాగే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తోంది.
పెరిగిన హోటళ్ల వ్యాపారం
భీమవరంలో హోటళ్ల వ్యాపారం గణనీయంగా పెరిగింది. గతంలో పట్టణంలో 80 హోటళ్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 130 వరకు పెరిగింది. కలెక్టరేట్‌లో పనిచేసే ఉద్యోగులతోపాటు జిల్లా నలుమూలల నుంచి వివిధ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల సంఖ్య పెరగడంతో హోటళ్ల వ్యాపారం పుంజుకుంది.
ఇళ్లు అద్దెలూ..
భీమవరంతోపాటు సమీప గ్రామాలైన విస్సాకోడేరు, తాడేరు, చినఅమిరం, రాయలం తదితర గ్రామాల్లో ఇళ్ల అద్దెలు పెరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటుకావడంతో ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దీంతో ఇళ్ల అద్దెలు పెరుగుతున్నాయి.
పాలన మరింత చేరువ
జిల్లాల పునర్విభజనతో ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువైంది. సమస్యలను సత్వరమే పరిష్కరించి అభివృద్ధిని వేగం చేయడానికి అవకాశం ఏర్ప డింది. పేదలకు నవరత్నాల పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా పరిధి తక్కువ విస్తీర్ణంలో ఉండటంతో ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే వెళ్లి పరిష్కరించగలుగుతున్నాం.
– పి.ప్రశాంతి, కలెక్టర్
సత్వర సేవలందించేలా..
నూతన జిల్లా విస్తీర్ణం తక్కువ, రవాణా సౌకర్యం అనుకూలం, తగినంత పోలీసు సిబ్బంది ఉండటంతో ప్రజలకు సత్వర సేవలందించగలుగుతున్నాం. దీంతో నేరాల సంఖ్య కూడా బాగా తగ్గింది. మారుమూల ప్రాంతాలకు కూడా వెంటనే చేరుకోగలుగుతున్నాం. సారా, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం.
– యు.రవిప్రకాష్, జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment