
పశ్చిమ గోదావరి: జనసేన ప్రచార రథం వారాహి స్టీరింగ్ చంద్రబాబు చేతిలో ఉందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న యాత్రపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికే రెండుసార్లు వారాహి వాహనంపై పవన్ కళ్యాణ్ యాత్ర వాయిదా పడిందని ఆయన గుర్తు చేశారు. పెంటపాడు మండలం ముదునూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ కోసం, తనకోసం ఏం చేసుకున్నా తప్పు పట్టడానికి లేదన్నారు. అయితే తన కోసం, తన పార్టీ కోసం కాకుండా టీడీపీ, చంద్రబాబు కోసం పనిచేయడం సిగ్గుచేటు అన్నారు.
జనసేన ప్రచార రథానికి ఏం పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, అయితే వారాహి రథంపై ప్రచార యాత్ర గతంలో రెండుసార్లు ఎందుకు వాయిదా పడిందని ఆయన ప్రశ్నించారు. కొండగట్టు ఆంజనేయస్వామి గుడి నుంచి వారాహి రథంపై పవన్ కళ్యాణ్ ప్రచార యాత్ర ప్రారంభిస్తానని చెప్పి ఎందుకు ఆగిపోయారని మంత్రి కొట్టు సూటిగా ప్రశ్నించారు. కేవలం ఆ సమయంలో రాజధాని రైతుల పాదయాత్ర జరుగుతుంది కాబట్టి వారాహి వాహనంపై ప్రచార యాత్ర ఆపేయాలని చంద్రబాబు ఆదేశించడంతో పవన్ కల్యాణ్ కేవలం పూజలతోనే సరిపెట్టారన్నారు.
ఆ తర్వాత రెండోసారి కూడా వారాహి వాహనంపై జనసేన ప్రచార యాత్ర ప్రారంభించాలని పవన్ కల్యాణ్ తలపెడితే ఆ సమయంలో లోకేష్ యువ గళం పాదయాత్ర కోసం ప్రచార యాత్ర ఆగిపోయిందన్నారు. ఈ విధంగా రెండు సార్లు చంద్రబాబు చెప్పగానే పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని షెడ్లో పెట్టేశారన్నారు. ఇప్పుడు మూడోసారి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి వాహనంపై పవన్ కల్యాణ్ ప్రచార యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది జరిగేవరకు గ్యారెంటీ లేదన్నారు. ఏ సమయంలో అయినా చంద్రబాబు నుంచి యాత్ర ఆపేయమని ఆదేశాలు వస్తే పవన్ ఆపేయడం తప్ప మరో మార్గం లేదన్నారు.
హామీలు అమలు చేయని బాబును ఎందుకు నిలదీయలేదు
ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు పవన్ కల్యాణ్ కు దేవుడిలా కనిపించడం దారుణమని మంత్రి అన్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేయండి అని చంద్రబాబుకు కౌంటర్ గ్యారెంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత హామీలు అమలు చేయకపోతే చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment