సాక్షి, భీమవరం: భీమవరంలో పట్టపగలు యువకుడి హత్య సంచలనం రేపింది. రౌడీషీటర్లకు సత్ప్రవర్తనపై కౌన్సెలింగ్ ఇచ్చి గంట గడవక ముందే ఈ హత్య జరిగింది. భీమవరం రెండో పట్టణం బలుసుమూడి గాంబీర్‌దొడ్డికి చెందిన బెవర విజయ్‌బాబు (23)ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. గతేడాది డిసెంబర్ 24న జరిగిన రౌతుల ఏసు హత్య కేసులో విజయ్‌బాబు నిందితుడు.
రౌడీషీటర్లకు భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ద్విచక్రవాహనంపై వెళ్తున్న విజయ్‌బాబు, గోవిందరావును గొల్లవానితిప్ప రోడ్డులోని దుర్గాలక్ష్మి ఆలయ సమీపంలో కారుతో ఢీకొట్టగా బైక్ నడుపుతున్న విజయ్‌బాబు కిందపడిపోయాడు. సోదరుడు గోవిందరావు పక్కనే ఉన్న పంటకాలువలోకి దూకి అవతలి గట్టుకు చేరుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు.
హంతకుల్లో ఒకరి అరెస్టు
ఢీకొట్టిన అనంతరం కారు విజయ్‌బాబును కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. దుండగులు అతనిపై కత్తులతో దాడి చేసి తల, మెడపై విచక్షణారహితంగా నరకడంతో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో నలుగురు, రెండు మోటార్‌సైకిళ్లపై వాహనాల్లో నిందితులు వెంబడించినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం కారు పట్టణం వైపు వెళ్లినట్లు పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు.
హత్య ఘటన తెలిసిన వెంటనే ఎస్సై అప్పారావు, ఏఎస్సై బాజీ ఒక యువకుడ్ని వెంటాడి పట్టుకోగా ఆ యువకుడి చేతిలో హత్య సమయంలో ఉపయోగించిన కత్తి ఉన్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన యువకుడు భీమవరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించాడు. మృతుడిపై రౌడీషీట్ ఉందని, హత్యకు కారణాలు సేకరిస్తున్నామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు. రూరల్ సీఐ సీహెచ్ నాగప్రసాద్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment