సాగులో డ్రోన్ల వినియోగం లాభదాయకం
భీమవరం అర్బన్: వరి సాగులో డ్రోన్లను వినియోగించి మందులు పిచికారీ చేయడం లాభదాయకమని, కూలీల ఖర్చు తగ్గుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం మండలంలోని తుందుర్రులో వరి పంటలో అగ్గితెగులు నివారణకు డ్రోన్ ద్వారా మందు వెదజల్లే పద్ధతిని ఆమె పరిశీలించారు. డ్రోన్ వాడకంపై ఆపరేటర్ మల్లుల శ్రీనివాసరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్‌లో సివిల్ ఇంజనీర్ చదివానని, వ్యవసాయం మీద మక్కువతో 2023లో రూ.4 లక్షలతో డ్రోన్‌ను స్వయంగా తయారు చేసి వినియోగిస్తున్నట్టు ఆపరేటర్ శ్రీనివాస్ కలెక్టర్‌కు తెలిపారు. డ్రోన్ వినియోగంపై యువతకు శిక్షణకు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అనంతరం గ్రామంలో ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను ఆమె పరిశీలించారు. జిల్లాలో 1.15 లక్షల మంది వివరాలు నమోదు చేయాల్సి ఉండగా 75 వేల మంది వివరాలను నమోదు చేసి గుర్తింపు సంఖ్యను అందించినట్టు వ్యవసాయ విస్తరణ అధికారి బి.దేవి స్వరూప వివరించారు.
రీసర్వే పనుల పరిశీలన
పైలెట్ ప్రాజెక్టులో భాగంగా తుందుర్రులో జరుగుతున్న రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామసభలో పాల్గొన్నారు. రీ సర్వే పనులకు రైతులు సహకరించాలని కోరారు. గ్రామంలో లే అవుట్లు, ఇళ్ల నిర్మాణాలపై తహసీల్దార్ రావి రాంబాబును అడిగి తెలుసుకున్నారు. స్థానిక నాయకులు మాట్లాడుతూ 39 మంది లబ్ధిదారులకు కేటాయించిన లే అవుట్ పల్లంలో ఉందని, గృహ నిర్మాణాలకు అనువుగా లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఈ–శ్రమ్ పోర్టల్ నమోదు, వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ఈ.నాగార్జున, ఎంపీడీఓ ఎన్ మురళీ గంగాధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ నాగరాణి
Comments
Please login to add a commentAdd a comment