ఏలూరు(మెట్రో): ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈనెల 27 నుంచి 29 వరకు లాంఫామ్ గుంటూరులో దక్షిణ భారత ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఏరువాక కేంద్రం ఏలూరు సమన్వయకర్త డాక్టర్ కె. ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల వ్యవసాయ పద్ధతులు, కూరగాయలు, పండ్ల సాగులో అధునాతన సాగు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం తదితర అంశాల ప్రదర్శనతోపాటు రైతుల–శాస్త్రవేత్తల చర్చా కార్యక్రమాలు ఉంటాయన్నారు. దక్షిణ భారత వ్యవసాయ నిపుణులు రైతులతో సంభాషించనున్నట్లు వెల్లడించారు.
ఏలూరులో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక రామచంద్రరావు పేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీసిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్ర రూపకల్పనకు గురువారం ప్రారంభ పూజ చేశారు. సెంటిమెంట్, హర్రర్, కామెడీ మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు వెంకట్ జుత్తిగ తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ నిరంతరాయంగా కొనసాగిస్తామని, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే లొకేషన్లు పరిశీలించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో ఇరువురు ప్రముఖ సీనియర్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తారని, వారి వివరాలు, హీరోయిన్ల వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. సినీ నిర్మాత వట్టి శ్యామ్‌బాబు మాట్లాడుతూ అనన్య చిత్రంలో విలన్ క్యారెక్టర్‌లో నటించిన అరవింద్ జాలా తమ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు చెప్పారు. తొలుత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించి చిత్రం ప్రజాదరణ పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.