
కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమమే
ఏలూరు (టూటౌన్): కోకో గింజలు కొనుగోలు, ధర సమస్యలు వెంటనే పరిష్కరించి కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే చలో గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం హెచ్చరించింది. ఏలూరు అన్నే భవనంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో కంపెనీలతో చర్చలు జరిపినా కొనుగోలు, ధర సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర ఇస్తామని కంపెనీలు అంగీకరించాయని ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చెప్పినా ఆచరణలో అమలు కావడం లేదని విమర్శించారు. రోజురోజుకీ ధర తగ్గించి వేస్తున్నాయని, కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడుకు ప్రతినిధి బృందం మార్చి 29న వినతి పత్రం అందజేయగా రెండు, మూడు రోజుల్లో కంపెనీలతో మీటింగ్ జరిపి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం కిలోకు రూ.700కు పైగా ధర ఉందని ప్రస్తుతం కంపెనీలు రూ.500 నుంచి రూ.550కు ధర ఇస్తున్నాయని, ఈ ధర మరింత తగ్గిస్తామని రైతులను బెదిరించడం దుర్మార్గమని విమర్శించారు. న్యాయం జరిగే వరకూ కోకో రైతులు ఐక్యంగా పోరాడతారని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. లేదంటే పోరాటం తప్పదన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ళ సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, ఉప్పల కాశీ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్, గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, రాష్ట్ర కోశాధికారి జాస్తి కాశీ బాబు తదితరులు పాల్గొన్నారు.