భీమవరం అర్బన్: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దిరుసుమర్రు గ్రామానికి చెందిన వేగేశ్న రామరాజు (63) గత కొంతకాలంగా ఆక్వా చెరువులు చేస్తున్నాడు. చెరువుల్లో పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి రామరాజును భీమవరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య వేగేశ్న మణి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ పి. మహేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘ఉపాధి హామీ’లో రజక వృత్తి చెరువులను బాగుచేయాలి
ఏలూరు (టూటౌన్): రజక వృత్తి చెరువులను ఉపాధి హామీ పథకం ద్వారా పూర్తి స్థాయిలో బాగుచేయించేందుకు అధికారులు చొరవ చూపాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజకజన సంఘ అధ్యక్షుడు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని రజక జనసంఘ కార్యలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో రజకులు వృత్తి చెరువులు పూడికలతో నిండి విస్తీర్ణం కోల్పోయిన పరిస్థితి నెలకొందని చెప్పారు.
పలుచోట్ల పూడికల కారణంగా రజక వృత్తికి తీవ్ర అవరోధంగా మారి రజకులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో రజక వృత్తి చెరువులను బాగుచేయించాలని కోరారు. ముఖ్యంగా గోపాలపురం, పోలవరం, నల్లజర్ల, చాగల్లు, ఉండి, తాడేపల్లిగూడెం, నియోజకవర్గాలు మండలాల్లోని చెరువులను బాగుచేయించాలని కట్లయ్య కోరారు. ఈ సమావేశంలో జిల్లా రజక నేతలు వట్లూరు మురళి, వి.శ్రీనివాసులు, శేషు, ఆర్.నాగేశ్వరరావు, మొలగాల దుర్గారావు, దేవరపల్లి రజక నాయకులు కదిలి సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.